ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలపై ఏపీ విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. ఈ ఏడాది ప్రథమ సంవత్సర విద్యార్ధులకు పబ్లిక్ పరీక్షలు యథావిధిగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తేల్చి చెప్పింది.
జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT) సిలబస్ అమలు, పరీక్షల నిర్వహణ, అంతర్గత మార్కుల విధానం వంటి పలు ప్రతిపాదనలను ఇంటర్మీడియట్ విద్యామండలి ఇటీవల ప్రకటించింది.
ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలను రద్దు చేయాలని ప్రతిపాదించగా పలువురు విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపాదనలపై ఈ నెల 26 వరకు సలహాలు, సూచనలు స్వీకరించిన ఇంటర్ బోర్డు తాజా ప్రకటన చేసింది. మొదటి ఏడాది పబ్లిక్ పరీక్షను యథావిథిగా నిర్వహించాలని నిర్ణయించింది.
పబ్లిక్ పరీక్షల్లో భాగంగా గణితంలో ఏ, బీ పేపర్లు కలిపి ఒకే పరీక్ష నిర్వహిస్తారు. వృక్ష, జంతు శాస్త్రాలు కలిపి జీవశాస్త్రంగా ఒకే పరీక్ష ఉంటుంది. రెండు భాషల సబ్జెక్టుల్లో ఆంగ్లం తప్పనిసరి కాగా మరో భాష సబ్జెక్ట్‌ను విద్యార్ధులు ఐచ్ఛికంగా ఎంపిక చేసుకోవచ్చు.