మంగళగిరిలో మెగా హ్యాండ్లూమ్ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. చేనేత కార్మికులకు 365 రోజులూ భృతి కల్పించే లక్ష్యంతో పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తమిళనాడులోని కంచి తరహాలో హ్యాండ్లూమ్ పార్కు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మంగళగిరి ఆటోనగర్ వద్దనున్న 10.80 ఎకరాలను చేనేత జౌళిశాఖ కమిషనర్ రేఖారాణితో కలిసి మంత్రి పరిశీలించారు.
నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పించాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబునాయుడు,మంత్రి లోకేశ్ కృతనిశ్చయంతో ఉన్నారని మంత్రి సవిత తెలిపారు. వారికి ప్రభుత్వపరంగా ఆర్థిక సహకారంతో పాటు 365 రోజులూ పని కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత ఏడు నెలల్లో రాష్ట్రంతో పాటు దేశంలోని పలు నగరాల్లో చేనేత బజార్లు ఏర్పాటు చేసి, చేనేత వస్త్రాల విక్రయాలు పెరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో నూతన టెక్స్టైల్స్ పాలసీకి శ్రీకారం చుట్టామని చెప్పారు. రాష్ట్రంలో వ్యాప్తంగా వీవర్ శాలలతో పది కొత్త క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్రం సహకారంతో విశాఖలో 5 ఎకరాల్లో యూనిటీ మాల్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు.
చేనేత కార్మికులకు సంవత్సరం పొడవునా పని కల్పించాలన్న లక్ష్య సాధనలో భాగంగానే హ్యాండ్లూమ్ పార్కు ఏర్పాటు చేయనున్నామని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు చేనేత జౌళి శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.