దేశ వ్యాప్తంగా కొత్తగా 32 వృద్ధాశ్రమాలు ఏర్పాటు
ఒక్కో ఆశ్రమానికి రూ. 25 లక్షల నిధులు
ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. పలు సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాల కేటాయింపులో ఏపీకి ప్రాధాన్యం ఇస్తున్న కేంద్రం, తాజాగా మరోసారి తన చిత్తశుద్ధిని చాటుకుంది.
అనాధ వృద్ధులకు అండగా నిలిచేందుకు గాను ఏపీలో కొత్తగా 12 వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్రం వీటిని నెలకొల్పేందుకు ఆమోదం తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 32 వృద్ధాశ్రమాలు కేటాయిస్తే అందులో ఆంధ్రప్రదేశ్‌కు 12 మంజూరు చేసింది. తిరుపతి జిల్లా పరిధిలో 4, వైఎస్సార్ జిల్లాలో రెండు, పార్వతీపురం, అనకాపల్లి, కాకినాడ, శ్రీసత్యసాయి, పల్నాడు , మన్యం, ఎన్టీఆర్ జిల్లాలకు ఒక్కోటి చొప్పున మంజూరు చేసింది. ఒక్కో ఆశ్రమానికి కేంద్రం 25 లక్షల నిధులు మంజూరు చేసింది.
ఆశ్రమంలో కనీసం 25 మంది ఉంటే ప్రతీ ఏడాది రూ.21 లక్షలు మంజూరు చేయనుంది. వీటిని స్వచ్ఛంద సేవా సంస్థలు నిర్వహిస్తాయి. కేంద్ర సాయంతో రాష్ట్రంలో 68 వృద్ధాశ్రమాలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మచిలీపట్నం, చిత్తూరు లో ఉన్నాయి. వంద వరకు ప్రైవేట్ నిర్వహణలో ఉన్నట్లు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది.