మహాకుంభమేళా లో తొక్కిసలాట పుకార్లపై స్పందించిన యూపీ సీఎం
అధికారుల సూచనలు పాటించాలని భక్తులకు వినతి
ప్రయాగ్రాజ్ మహాకుంభ మేళాలో మౌనీ అమావస్య సందర్భంగా నేటి తెల్లవారుజామున విపరీతమైన రద్దీ చోటుచేసుకుంది. తొక్కిసలాట లాంటి పరిస్థితి చోటుచేసుకోగా వెంటనే రంగంలోకి దిగిన కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశాయి.
సోషల్ మీడియాలో కొంతమంది పుకార్లు వ్యాప్తి చేయడంపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. వదంతులను భక్తులు, సాధువులు పట్టించుకోవద్దని, అధికారుల సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.
తెల్లవారుజామున జరిగిన ఘటనలో కొంతమంది తీవ్రంగా గాయపడ్డారని, వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ముఖ్యమంత్రి యోగి వెల్లడించారు. పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు ఫోన్ చేసి ఆరా తీస్తున్నారని వివరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం నుంచి తనకు నాలుగు సార్లు ఫోన్ చేసి వివరాలు అడిగారని చెప్పారు. బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ కూడా వివరాలు తెలుసుకుంటున్నారని తెలిపారు.
ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో దాదాపు 8 కోట్ల మంది యాత్రికులు ఉన్నారని, మంగళవారం నాడు సుమారు 5.5 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించారని ప్రభుత్వం లెక్కలతో వివరిస్తోంది.
త్రివేణి సంగమం వైపు భక్తులు ఎక్కువగా రావడంతో బారికేడ్లు విరిగిపోవడంతో కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.