కాంగ్రెస్ పార్టీ విదేశీ విభాగం ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా మరోసారి పిచ్చిప్రేలాపనలు పేలాడు. శామ్ పిట్రోడా, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడన్న సంగతి తెలిసిందే. అక్రమంగా చొరబడి భారత్లో నివసిస్తున్న బంగ్లాదేశీయులకు మద్దతు పలకడం ద్వారా శామ్ పిట్రోడా మరోసారి తేనెతుట్టె కదిపాడు.
సామాజిక మాధ్యమాల్లో విడుదలైన ఒక వీడియోలో శామ్ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. ‘‘మనం మన గ్రహం గురించి ఆలోచించడం లేదు. మనం భూతాపం గురించి ఆందోళన చెందడం లేదు. ఎందుకంటే మనం నిరుపేదలు, ఆకలితో అలమటిస్తున్న వారూ అయిన చొరబాటుదారులను వేటాడడంలో బిజీగా ఉన్నాం’’ అంటూ శామ్ పిట్రోడా అక్రమ చొరబాటుదారులపై జాలి ఒలకబోసాడు.
‘‘వాళ్ళు ఇక్కడకు రావడానికి చాలా కష్టపడతారు. అక్రమంగానే అనుకోండి. అది సరైనది కాదని నాకూ తెలుసు. కానీ మనం అక్రమ బంగ్లాదేశీ చొరబాటుదారులను, మైనారిటీలనూ లక్ష్యం చేసుకుని దాడులు చేయడంలో బిజీగా ఉన్నాం’’ అని వ్యాఖ్యానించాడు.
శామ్ పిట్రోడా అక్కడితో ఆగలేదు. ‘‘మనం అందరినీ కలుపుకుని పోతాం అని మాటల్లో చెబుతాం. కానీ దానికి వ్యతిరేకంగా చేస్తున్నాం. అక్రమ బంగ్లాదేశీయులను కలుపుకుని పోవడం లేదు. వాళ్ళ వల్ల మనం కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తే, అదేం పర్వాలేదు కదా. మనం కొద్దిగానే కష్టపడతాం. ఎవరూ (తమ వనరులను అక్రమ బంగ్లాదేశీయులతో) పంచుకోడానికి ఇష్టపడడం లేదు. అన్ని వనరులూ తమకే కావాలని అందరూ భావిస్తున్నారు’’ అని ప్రేలాపలను పేలాడు.