మహారాష్ట్ర మాలేగావ్ జిల్లాలో గణతంత్ర దినోత్సవం నాడు ఘోరం జరిగింది. పావర్వాడీ పోలీస్ స్టేషన్ పరిధిలో మొహిసిన్ అనే వ్యక్తి జాతీయ పతాకం కిందనే గోమాంసం విక్రయిస్తున్న సంఘటన వెలుగు చూసింది. మాలేగావ్ నగరపాలక సంస్థలో సీనియర్ అధికారి అయిన మనీష్ ధిలారే, మొహిసిన్ మీద ఫిర్యాదు చేసారు.
జనవరి 26 నాడు గణతంత్ర దినం సందర్భంగా మాలేగావ్ నగరపాలక సంస్థ పరిధిలో ఎలాంటి మాంసాన్ని విక్రయించరాదంటూ జనవరి 22నే నోటీసులు జారీ చేసామని మనీష్ ధిలారే వెల్లడించారు. ఆ మేరకు దినపత్రికలు, స్థానిక ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాల్లో సైతం నోటీసులు ప్రసారం చేసామని తెలియజేసారు. అయినప్పటికీ నిందితుడు నోటీసులను ఉల్లంఘించాడు. జాతీయ జెండా కిందనే పట్టపగలు 11 గంటలకే గోమాంసం విక్రయిస్తూ జెండాను అవమానించాడని మనీష్ ధిలారే వివరించారు.
మొహిసిన్ జెండా కిందనే గోమాంసం అమ్ముతుండగా చూసినవారు ఫొటో తీసి స్థానిక జిల్లా వాట్సాప్ గ్రూప్లో పెట్టారు. అది కాస్తా వైరల్ అయి అధికారుల దృష్టికి చేరింది. నగరపాలక సంస్థ అధికారులు ఆ ఫొటోలోని నిజానిజాలను స్వయంగా తెలుసుకోడానికి వెంటనే ఆ ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ నిందితుడు గోమాంసం అమ్ముతుండగా స్వయంగా చూసారు. మొహిసిన్ అనే వ్యక్తి ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించి గణతంత్ర దినం రోజున గోమాంసం అమ్ముతుండగా పట్టుబడ్డాడు.
నిందితుడిపై భారతీయ ధ్వజ సంహిత సెక్షన్ 2, భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 223, మహారాష్ట్ర పోలీస్ చట్టం సెక్షన్లు 105, 107 ప్రకారం నేరారోపణ చేసారు. మహారాష్ట్రలో గోమాంసం విక్రయాలపై 2024 మార్చిలో నిషేధం విధించారు. గోమాంసం విక్రయిస్తూ లేదా భుజిస్తూ పట్టుబడిన వ్యక్తికి గరిష్టంగా ఐదు సంవత్సరాల జైలుశిక్ష, రూ.10వేల జరిమానా విధించవచ్చు.