రాజస్థాన్లోని బీజేపీ ప్రభుత్వం సోమవారం నాడు అక్రమ చొరబాటుదారులపై విరుచుకుపడింది. రాష్ట్ర రాజధాని జైపూర్లో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలు, బంగ్లాదేశీయులను నిర్బంధించింది.
జైపూర్ పోలీసులు సోమవారం నాడు నగరంలో అక్రమ చొరబాటుదారులు ఉండే ప్రాంతాలపై దాడులు చేసారు. 500 మంది అక్రమ చొరబాటుదారులను నిర్బంధించారు. వారిలో 394 మంది రోహింగ్యాలు, మిగతా 106 మంది బంగ్లాదేశీయులు ఉన్నారు.
జైపూర్ నగర పోలీస్ కమిషనర్ బిజూ జార్జ్ జోసెఫ్ ఈ పరిణామాన్ని ధ్రువీకరించారు. నగరంలో నేరగాళ్ళను, అక్రమ చొరబాటుదారులను గుర్తించడానికి భారీ ఆపరేషన్ చేపట్టినట్లు ఆయన తెలియజేసారు. ‘‘కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలోనూ నేరగాళ్ళను పట్టుకోడానికి భారీ కార్యక్రమాన్ని చేపట్టాము’’ అని చెప్పారు. నిర్బంధించిన రోహింగ్యాలు, బంగ్లాదేశీయులను విచారిస్తారు.
గతేడాది అక్టోబర్లో అధికారులు జైపూర్లో అక్రమంగా నివసిస్తున్న 12మంది బంగ్లాదేశీయులను పట్టుకున్నారు.