భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు అత్యధిక దిగుమతి పన్నులు విధిస్తున్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆ దేశాలపై టారిఫ్ వేస్తామంటూ హెచ్చరించారు. అమెరికన్లను సంపన్నులను చేయాలనుకుంటున్నట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. విదేశాలను సుసంపన్నం చేసే పన్నుల వ్యవస్థను రద్దు చేసి, అమెరికన్లను ధనవంతులుగా మార్చే వ్యవస్థ రావాలంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధిక సుంకాలు విధించే దేశాలపై చర్యలు తప్పవని, అందుకే ఎక్స్టర్నెల్ డిపార్టుమెంటును ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు.
అమెరికన్లపై ఆదాయపన్ను రద్దు చేయాలనుకుంటున్నట్లు అధ్యక్షడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీని ద్వారా అమెరికన్లు స్వేచ్ఛగా ఖర్చుచేసుకునే వీలు కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా ప్రభుత్వానికి ఆదాయపన్ను ద్వారా ప్రస్తుతం పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతోంది. దీన్ని రద్దు చేయడం ద్వారా తగ్గే ఆదాయాన్ని విదేశాల నుంచి దిగుమతి అవుతోన్న వస్తువులపై టారిఫ్లు వేయాలని ట్రంప్ యోచిస్తున్నారు.
అమెరికా 1870 నుంచి 1913 వరకు సుసంపన్నంగా ఉందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో అమెరికా ప్రజలను ధనవంతులను చేయాలనుకుంటున్నట్లు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. దిగుమతులపై పన్నులు వేయడం ద్వారా ఆదాయం పెంచుకోవాలని చూస్తున్నారు. ఇదే సమయంలో అమెరికా పౌరులపై పన్నులు తగ్గించి వారి కొనుగోలు శక్తిని పెంచాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు.