ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైసీపీ ప్రభుత్వం నమోదు చేసిన సీఐడి కేసులను సీబీఐకి బదిలీ చేయాలంటూ హైకోర్టు న్యాయవాది బి.బాలయ్య దాఖలు చేసిన పిటీషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. చంద్రబాబుపై స్కిల్ స్కాంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం సీఐడి కేసులు నమోదు చేసింది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలంటూ వచ్చిన పిటిషన్పై జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
చంద్రబాబునాయుడుపై నమోదైన ఏడు సీఐడి కేసులను సీబీఐకి బదిలీ చేయాలంటూ బాలయ్య తరపున ప్రముఖ న్యాయవాది మణీందర్ సింగ్ వాదనలకు సిద్దం కాగా జస్టిస్ బేలా త్రివేది ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషన్ కొట్టివేస్తూ జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు, మరొక్క మాట అనవసరంగా మాట్లాడినా భారీగా జరిమానా విధిస్తామని, ఆ జరిమానా ఎవరూ ఊహించనంతగా ఉంటుందని హెచ్చరించారు. మీలాంటి సీనియర్ న్యాయవాదులు ఇలాంటి కేసులు వాదించడానికి సిద్దపడతారని తాము ఊహించలేదని జస్టిస్ బేలా త్రివేది వ్యాఖ్యానించారు.