త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నోటికొచ్చిన ప్రేలాపనలు పేలుతున్నారు. ఆ క్రమంలోనే, హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ఆ రాష్ట్రం నుంచి ఢిల్లీకి సరఫరా చేసే యమున నీటిలో విషం కలుపుతోందంటూ ఆరోపించారు. అయితే అది తప్పుడు సమాచారమని ఢిల్లీ జల్ బోర్డు స్పష్టం చేసింది.
ఢిల్లీ జల్ బోర్డ్ సీఈఓ శిల్పా శిండే సోమవారం నాడు ఢిల్లీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి లేఖ రాసారు. ఆ లేఖలో ఆప్ అధినేత చేసిన ప్రకటనలు ‘నిజానికి తప్పులుగా ఉన్నాయ’ని స్పష్టం చేసారు. ‘‘కేజ్రీవాల్ చేసిన ప్రకటనలు వాస్తవానికి ఎంతమాత్రం నిజం కావు, వాటికి ఏ ప్రాతిపదికా లేదు. అవి తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయి. అలాంటి తప్పుడు ప్రకటనలు నగర ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తాయి. ఎగువ రాష్ట్రమైన హర్యానాతో సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడేలా చేస్తాయి’’ అని శిల్పా శిండే రాసారు.
ఈ విషయాన్ని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా దృష్టికి తీసుకెళ్ళాలంటూ శిల్పా శిండే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కోరారు. ‘‘ఈ విషయం అంతర్రాష్ట్ర సంబంధాలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఈ వాస్తవాలను వెల్లడించాల్సి ఉంది. ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ నియమ నిబంధనల ప్రకారం ఈ విషయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ దృష్టికి తీసుకువెళ్ళవలసిందిగా కోరుతున్నాము’’ అని జల్ బోర్డ్ సీఈఓ రాష్ట్ర సీఎస్‌ను కోరారు.
వచ్చేవారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఆ నేపథ్యంలో బీజేపీ మీద బురద జల్లడానికి కేజ్రీవాల్ ప్రయత్నించారు. ‘‘హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం యమునా నది నీటిలో విషం కలిపింది. ఆ నీళ్ళు ఢిల్లీకి చేరి ఉంటే, ఇక్కడ సరఫరా చేసే తాగునీటిలో కలిసి ఉంటే ఎంతోమంది చనిపోయి ఉండేవారు. అదొక సామూహిక జన హనన దుర్మార్గం అయి ఉండేది. అయితే ఢిల్లీ జల్ బోర్డు అప్రమత్తంగా ఉండడం వల్ల ఆ విషపూరితమైన నీటిని ఇక్కడ తాగునీటిలో కలవకుండా నిలువరించగలిగింది’’ అని కేజ్రీవాల్ ఆరోపించారు.
నిరాధారమైన ఆరోపణలు చేసిన అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ నేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఫేక్ న్యూస్‌ను వ్యాపింపజేయడం ద్వారా ఢిల్లీలో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి హింస జరిగేలా చేయాలని, తద్వారా ప్రజలను భయభ్రాంతులను చేయాలనీ కేజ్రీవాల్ ప్రయత్నించారంటూ మండిపడ్డారు. మరోవైపు, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ, కేజ్రీవాల్ ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఢిల్లీలో నీటికొరతకు కారణం తాము యమునా జలాలను సరిగ్గా ఇవ్వకపోవడం కాదనీ, కేజ్రీవాల్ పదేళ్ళ పాటు సీఎంగా ఉన్నా తాగునీటి సరఫరాకు సరైన వ్యవస్థను ఏర్పాటు చేసి అమలు చేయడంలో విఫలమవడమే కారణమని మండిపడ్డారు.
‘‘విషపూరితమైన నీళ్ళ సరఫరా వంటి తప్పుడు ఆరోపణలు చేయడం, వాటికి ఏ ఆధారాలూ చూపించకుండా పారిపోవడం అతని పద్ధతి. యమునా నది హర్యానా నుంచి ఢిల్లీకి చేరుకునే సోనిపట్ దగ్గరకు మా ప్రధాన కార్యదర్శిని పంపిస్తాను, కేజ్రీవాల్ తమ సీఎస్‌ను పంపాలి. అక్కడే విషయం తేల్చేద్దాం’’ అని నాయబ్ సింగ్ సైనీ సవాల్ విసిరారు.