కాశీ మథుర దేవాలయాలను మళ్ళీ పొందడానికి ప్రయత్నించడం కేవలం లక్ష్యం కాదని, అది తిరుగులేని నిర్ణయమని విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్ ప్రకటించారు. విహెచ్‌పి ఆదివారం నిర్వహించిన సంత్ సమ్మేళన్‌లో మాట్లాడుతూ ఆయన 1984లో జరిగిన ధర్మ సంసద్ చేసిన చారిత్రక తీర్మానాన్ని గుర్తు చేసుకున్నారు. ఆనాటి సమావేశంలో అయోధ్య, మథుర, కాశీ పుణ్యక్షేత్రాలలో హిందువులను అవమానించే చిహ్నాలను తొలగించివేయాలంటూ సాధుసంతులు డిమాండ్ చేసారు. దాన్ని గుర్తు చేసిన అలోక్ కుమార్ ‘‘అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఇక కాశీ, మథుర తమ న్యాయబద్ధమైన సంరక్షకుల చెంతకు చేరాల్సిన తరుణం ఆసన్నమైంది’’ అన్నారు.
సంత్ సమ్మేళనానికి స్వామి పరమానంద్ మహరాజ్ అధ్యక్షత వహించారు. జగద్గురు శంకరాచార్య వాసుదేవానంద సరస్వతి స్వామి సహా దేశవ్యాప్తంగా ఎంతోమంది సాధుసంతులు, ఆధ్యాత్మిక గురువులు పాల్గొన్నారు. ప్రభుత్వాల నియంత్రణలో దేవాలయాలు, తగ్గుతున్న హిందూ జనాభా, సాంస్కృతిక పరిరక్షణ వంటి… వర్తమాన హిందూ సమాజం ఎదుర్కొంటున్న క్లిష్ట సమస్యల గురించి ఆ సమావేశంలో చర్చించారు.
దేవాలయాలకు విముక్తి కావాలి:
గుడులపై ప్రభుత్వ పెత్తనం అంశం గురించి అలోక్ కుమార్ వివరిస్తూ, దేవాలయాల ఆదాయాన్ని ఈస్టిండియా కంపెనీ తమ ఖజానాలకు బదిలీ చేసుకోవడంతో గుడులపై ప్రభుత్వాల పెత్తనం పద్ధతి మొదలైందని వివరించారు. చర్చిలు, మసీదులు స్వతంత్రంగా ఉంటుండగా కేవలం హిందువుల దేవాలయాలు మాత్రమే ప్రభుత్వం అధీనంలో ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. ‘‘అది వివక్ష, అన్యాయం. తమ దేవాలయాలను నిర్వహించుకునే సామర్థ్యం హిందూ సమాజానికి ఉంది’’ అని అలోక్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ‘‘దేవాలయాలకు ప్రభుత్వాల నుంచి విముక్తి కల్పించాలంటూ విశ్వహిందూ పరిషత్ ఉద్యమం ప్రారంభించింది. విజయవాడలో హైందవ శంఖారావం పేరిట భారీ కార్యక్రమం నిర్వహించింది. లక్షల మంది ప్రజలు పాల్గొన్న ఆ సభ ఆలయాల గురించి ప్రజల్లో ఆలోచన మొదలైంది. త్వరలోనే హిందూ దేవాలయాలు హిందూ సమాజం చేతికి వచ్చేస్తాయి. ఆ లక్ష్యాన్ని సాధించేంత వరకూ ఆగబోము’’ అని అలోక్ కుమార్ ప్రకటించారు.
హిందూ జనాభా పెరగాలి:
హిందువుల జననాల సంఖ్య తగ్గిపోతుండడంపై అలోక్ కుమార్ ఆందోళన చెందారు. దాన్నొక భౌగోళిక సంక్షోభంగా అభివర్ణించారు. ‘‘ఒక దేశ జనాభా స్థిరంగా ఉండడానికి పెరుగుదల రేటు కనీసం 2.1 ఉండాలి. కేరళలో అది 1.7 మాత్రమే ఉంది. దేశవ్యాప్త సగటు కూడా క్రమంగా పడిపోతోంది. ఇదే క్రమం కొనసాగితే వృద్ధులు ఎక్కువగానూ, యువతరం తక్కువగానూ ఉండే భవిష్యత్తును ఎదుర్కొనే రోజు త్వరలోనే వస్తుంది’’ అని హెచ్చరించారు. వివాహ వయస్సు పెరిగిపోతుండడం వల్లనే ఈ సమస్య తలెత్తుతోందని ఆయన గమనించారు. వయస్సు పెరుగుదల అనేది కుటుంబంలో సమస్యలు పెరగడానికి దారితీస్తోందన్నారు. హిందూ కుటుంబాలు కనీసం ముగ్గురు పిల్లలను కనడం గురించి ఆలోచించాలని, అప్పుడే జనసంఖ్య సమతౌల్యం సాధ్యమవుతుందని, అప్పుడే సామాజిక, సాంస్కృతిక సమతూకం నిలబడుతాయనీ వివరించారు.
ప్రార్థనా స్థలాల చట్టం తొలగించాలి:
ప్రార్థనా స్థలాల చట్టాన్ని తొలగించడానికి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని అలోక్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. ఎన్నో దేవాలయాల పునరుద్ధరణను, చరిత్రలో జరిగిన తప్పుల సవరణనూ ఆ చట్టం అన్యాయంగా అడ్డుకుంటోందని ఆయన వాదించారు.
బంగ్లాదేశ్‌లో హిందువుల దుస్థితి:
‘‘బంగ్లాదేశ్‌ను హిందువులు లేని దేశంగా మార్చడానికి ప్రయత్నాలు జరిగితే, మా ప్రయత్నాలు మేమూ చేస్తాము. గతంలో బంగ్లాదేశ్ మీద దౌత్యపరమైన ఒత్తిడి ఫలితాన్నిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల రక్షణకు మా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి’’ అని అలోక్ కుమార్ చెప్పారు.
ఆ సమ్మేళనంలో ఎందరో సాధుసంతులు అద్భుతమైన ప్రసంగాలు చేసారు. హిందూ దేవాలయాల పరిరక్షణ మొదలుకొని ఎన్నో అంశాలపై హిందూ సమాజం అనుసరించాల్సిన పద్ధతి గురించి మార్గదర్శనం చేసారు. కర్ణాటకకు చెందిన సంత్ సోమలింగ మహరాజ్, వర్కారీ తెగకు చెందిన స్వామి హరిభక్త్ నారాయణ్ షిండే, టిబెట్ వజ్రయాన సంప్రదాయానికి చెందిన పలకానంద్ మహరాజ్, ఒడిషాకు చెందిన డాక్టర్ శ్రుతి సాగరానంద్ మహరాజ్, సాధ్వి ప్రజ్ఞాభారతి, మహామండలేశ్వర జ్యోతిర్మయానంద తదితర సాధువులు, సంతులు ప్రజల్లో హిందూమతాన్ని పునరుజ్జీవింపజేయడానికి తమ ప్రయత్నాలు తాము చేస్తున్నామని చెప్పారు.