వైఎస్ఆర్సిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులను బదిలీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ మేరకు రఘు రామకృష్ణ రాజు వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. జగన్ మీద కేసుల రోజువారీ విచారణ చేపట్టాలని జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్‌చంద్ర మిశ్రాల ధర్మాసనం ఆదేశించింది.
జగన్ అక్రమాస్తుల కేసు విచారణను వేరే న్యాయస్థానాలకు బదిలీ చేయాలని కోరుతూ ప్రస్తుతం తెలుగుదేశం, గతంలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అయిన రఘు రామకృష్ణ రాజు వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రజాప్రతినిధుల కేసుల విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ కేసుకు కూడా వర్తిస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది.
జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ విషయంలోనూ ప్రత్యేక విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాంతో ఆ పిటిషన్‌ను రఘు రామకృష్ణ రాజు న్యాయవాది ఉపసంహరించుకున్నారు.
జగన్ ఆస్తుల కేసు విచారణ సరిగా జరగడం లేదంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. వారాంతపు రెండు రోజుల్లో మాత్రమే ఆ కేసు విచారణ జరుగుతోందని వివరించారు. రోజువారీ విచారణ జరిగేలా చూడాలని కోరారు.
ఆ నేపథ్యంలో, బెయిల్ రద్దు గురించి ప్రత్యేకంగా విచారించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు వెల్లడించింది. బెయిల్ రద్దుకు కారణాలు ఏమీ లేవని, ఆ కేసుల పర్యవేక్షణ తాము చేయాలని పిటిషనర్ కోరుతున్నారా అంటూ సుప్రీం బెంచ్ అసహనం వ్యక్తం చేసింది. దాంతో ఆ పిటిషన్‌ను వెనక్కు తీసుకుంటామని రఘురామ న్యాయవాది ధర్మాసనానికి చెప్పారు.
జగన్ అక్రమాస్తుల కేసుల బదిలీ వీలుకాదని సుప్రీంకోర్టు గతంలో చెప్పినందున, ఆ కేసులను సుప్రీంకోర్టు పర్యవేక్షించాలని రఘురామ తరఫు న్యాయవాది కోరారు. సీబీఐ కేసుల వివరాలు, ఆ కేసుల విచారణ ప్రస్తుత స్థితిగతుల వివరాలతో దర్యాప్తు సంస్థ అఫిడవిట్ దాఖలు చేసినట్లు సీబీఐ న్యాయవాది కోర్టుకు వివరించారు. ఆ కేసులను తెలంగాణ హైకోర్టు పర్యవేక్షిస్తోందని జగన్ తరఫు న్యాయవాది వాదించారు. చివరకు రఘురామ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ సుప్రీం ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించింది.