ధాన్యం సేకరణలో 89.92% మంది రైతుల నుంచి సంతృప్తి
గోనె సంచుల విషయంలో 30% శాతం అసంతృప్తి
ఆసుపత్రుల్లో సేవలపై 35% అసంతృప్తి, అవినీతిపై 37% ఫిర్యాదు
పలు పథకాల్లో సిబ్బంది, ఉద్యోగుల నిర్లక్ష్యం, అవినీతిపై ఫిర్యాదులు
ప్రజలే మొదటి ప్రాధాన్యంగా వారి అభిప్రాయాలు, అంచనాల మేరకు ప్రతీ ఉద్యోగీ, ప్రతీ అధికారీ, ప్రతీ విభాగమూ పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల నుంచి నేరుగా సేకరించిన సమాచారం ఆధారంగా ఆయా శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి ఇవాళ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సేవల గురించి లబ్ధిదారుల స్పందన గురించి ఐవిఆర్ఎస్‌తో పాటు వివిధ రూపాల్లో సర్వేలు నిర్వహించారు. వాటి ఆధారంగా శాఖల వారీగా సమీక్ష చేసారు. మొత్తం 10 అంశాల్లో నిర్వహించిన సర్వేల ఆధారంగా సమీక్ష చేపట్టిన సిఎం ప్రభుత్వ సేవల్లో వేగం, నాణ్యత పెరగాలని, పథకాల పంపిణీలో అవినీతి ఉండకూడదని స్పష్టం చేసారు.
సీఎంకు అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్‌లో వివరాలు ఇలా ఉన్నాయి.
పింఛన్ల పంపిణీ:- 1వ తేదీన ఇంటివద్దే పింఛన్ అందుతోందా అనే ప్రశ్నకు 90.20 శాతం మంది లబ్ధిదారుల నుంచి సంతృప్తి వ్యక్తమైంది. పింఛను అందించిన ఉద్యోగుల ప్రవర్తనపై 87.48 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. పింఛన్ల అందజేతలో అక్కడక్కడా అవినీతి జరుగుతోందని 15.60 శాతం మంది ఫిర్యాదు చేసారు.
అన్న క్యాంటీన్:- పారిశుధ్యంపై 82 శాతం మంది, ఆహారంలో నాణ్యతపై 91 శాతం మంది, సమయపాలనపై 84 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు.
ధాన్యం సేకరణ:- సేకరణ విధానంపై 89.92 శాతం మంది రైతులు సంతృప్తి వ్యక్తం చేసారు. గోనెసంచుల విషయంలో 30 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యతకు తగిన ధర లభించిందని 84 శాతం మంది భావించారు.
దేవాలయాల్లో దర్శనాలు:- రాష్ట్రంలోని 7 ప్రధాన దేవాలయాల్లో దర్శనాల తీరుపై సర్వే నిర్వహించారు. 70 శాతం మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేసారు. వసతులపై 37 శాతం మంది భక్తుల్లో అసంతృప్తి కనిపించింది. ప్రసాదంపై 81 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేసారు.
ఎన్టీఆర్ వైద్యసేవ:- ఆసుపత్రుల్లో అడ్మిషన్‌పై 90 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేసారు. సేవల విషయంలో 87 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేసారు. వైద్యమిత్రల పనితీరుపై 87 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేసారు.
ప్రభుత్వ ఆసుపత్రులు :- వైద్యులు, సిబ్బంది అందుబాటుపై 65 శాతం మంది సంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవినీతి జరుగుతోందని 37 శాతం మంది అభిప్రాయపడ్డారు.
దీపం2 పథకం:- సిలెండర్ అందుకున్న 48 గంటల్లో డబ్బులు తమ ఖాతాల్లో జమ అవుతున్నాయని 48 శాతం మంది చెప్పారు. ఈ విషయంలో సాంకేతిక ఇబ్బందులను పరిష్కరించి నిర్దేశిత సమయంలో డబ్బులు అకౌంట్లో పడేలా చూడాలని సిఎం ఆదేశించారు.
ఆర్టీసీ:- ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం అని 88 శాతంమంది భావిస్తున్నారు. గమ్యస్థానాలను సమయానికి చేరుకునే విషయంలో 27 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. బస్‌స్టాండ్‌లలో మౌలిక వసతులపై 63 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇసుక, ఎరువుల విషయంలో సంతృప్తి స్థాయి మరింత పెరగాలని సిఎం అధికారులకు సూచించారు. ఇసుక లభ్యతపై 78 శాతం మంది, రిజిస్ట్రేషన్ ప్రక్రియపై 79 శాతం, రవాణా ఛార్జీలపై 75 శాతం మంది లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేసారు. ఉచిత ఇసుక విధానం మరింత మెరుగుపడాలని, నూరు శాతం సంతృప్తి కనిపించాలని సిఎం ఆదేశించారు.