తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అర్థశతకం
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యం సాధించింది. చెన్నై వేదికగా శనివారం జరిగిన మ్యాచ్ లో భారత్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19.2 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి సాధించింది.
ఈ మ్యాచ్ లో తొలుత టాస్ నెగ్గిన భారత్, ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ కు దిగి 9 వికెట్లు నష్టపోయి 165 పరుగులు చేసింది. కెప్టెన్ జోస్ బట్లర్ 30 బంతుల్లో 45 పరుగులు చేశాడు. బ్రైడాన్ కార్స్( 31), జేమీ స్మిత్( 22) మినహా మిగతావారు విఫలమయ్యారు.
భారత బౌలర్లలో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు తీయగా అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
భారత్ 166 పరుగుల ఛేదనకు తీవ్రంగా శ్రమించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (12), సంజు శాంసన్ (5) విఫలమయ్యారు. సూర్యకుమార్ (12) కూడా మరోసారి అభిమానులను నిరాశపరిచాడు. ధ్రువ్ జురెల్ (4)ను కార్స్ ఔట్ చేయడంతో భారత్ బ్యాటింగ్ ఆర్డర్ పై తీవ్ర ప్రభావం పడింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మాత్రం పట్టుదలతో క్రీజులో పాతుకుపోయాడు. 55 బంతులు ఎదుర్కొని 72 పరుగులతో నాటౌట్ గా నిలబడి జట్టుకు విజయాన్ని అందించాడు. వాషింగ్టన్ సుందర్ 19 బంతుల్లో 26 పరుగులు చేశాడు.
19.2 ఓవర్లలో భారత్ 8 వికెట్లు నష్టపోయి 166 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో సిరీస్ లో 2-0 ఆధిక్యం సాధించింది.
ఇరుజట్ల మధ్య మూడో టీ20 రాజ్‌కోట్ వేదికగా మంగళవారం జరగనుంది.