ఒక దేశం, ఒక ఎన్నిక విధానం వల్ల దేశ పరిపాలనలో నిలకడతనం వస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. గణతంత్ర దిన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఒక దేశం ఒక ఎన్నిక పద్ధతి… విధానపరమైన నిష్క్రియాపరత్వాన్ని నియంత్రిస్తుంది, వనరుల విభజనను నిలువరిస్తుంది, ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది అని ముర్ము వ్యాఖ్యానించారు.
బ్రిటిష్ ప్రభుత్వ పాలనాకాలపు వలస విధానాల భావజాలపు బూజును తొలగించేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్రపతి అన్నారు. దానికి ఉదాహరణగా, తెల్లవారి కాలపు నేరచట్టాలను తొలగించి మూడు ఆధునిక చట్టాలను అమల్లోకి తీసుకొచ్చిన సంగతిని రాష్ట్రపతి గుర్తుచేసారు.
ఇటీవలి కాలంలో భారతదేశపు ఆర్థిక ప్రగతి నిలకడగా పెరుగుతూ ఉందని రాష్ట్రపతి గుర్తించారు. దానివల్ల ఎన్నో ఉద్యోగావకాశాలు వచ్చాయనీ, రైతులు కూలీలకు ఆదాయం పెరిగిందనీ చెప్పారు. భారతదేశంలో కోట్లాదిమందిని పేదరికం నుంచి బైటకు లాక్కొచ్చిందని ద్రౌపది ముర్ము వివరించారు.
రాష్ట్రపతి మనదేశపు సమ్మిళిత అభివృద్ధి ప్రాధాన్యత గురించి, ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్న సంగతి గురించీ వివరించారు. అందరికీ ఉండడానికి ఇళ్ళు, తాగడానికి మంచినీరు వంటి కనీస అవసరాలు తీర్చడం ద్వారా ప్రస్తుత ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి కట్టుబడి ఉందని ద్రౌపది చెప్పుకొచ్చారు. దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సహకరించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్రపతి వివరించారు.
20వ శతాబ్దపు తొలినాళ్ళలో తమ పోరాటాల ద్వారా జాతిని ఏకీకృతం చేసిన స్వతంత్ర సమర యోధులను రాష్ట్రపతి ప్రశంసించారు. ‘‘న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, పారంపర్యం అనేవి కేవలం ఆధునిక మౌలికాంశాలు మాత్రమే కావు, అవి మన నాగరిక వారసత్వంలో అంతర్గతంగా సమ్మిళితమైపోయాయి’’ అని ఆవిడ గుర్తుచేసుకున్నారు.