ఇవాళ భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటోంది. మనదేశానికి 1947లో స్వతంత్రం వచ్చింది. కానీ మన దేశాన్ని పాలించుకోడానికి అవసరమైన రాజ్యాంగాన్ని రూపొందించుకోడానికి సుమారు మూడేళ్ళ సమయం పట్టింది. ఆ రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. అందుకే ఇవాళ మనం గణతంత్ర దినంగా జరుపుకుంటాము.
రాజ్యాంగం ఏర్పాటు కోసం మన తొలితరం పాలకులు రాజ్యాంగ రచనా కమిటీ ఏర్పాటు చేసారు. దానికి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్యవహరించారు. అంతకుముందే రాజ్యాంగ పరిషత్తుకు బెనెగల్ నరసింగరావు అనే సీనియర్ అధికారిని సలహాదారుగా నియమించారు. ఆ బెనెగల్ నరసింగరావు రాజ్యాంగపు మౌలిక ముసాయిదా రాసారు. దాన్ని డ్రాఫ్టింగ్ కమిటీకి పరిశీలన కోసం పంపించారు. దాని ఆధారంగా డ్రాఫ్టింగ్ కమిటీలోని సభ్యులు కొత్త ముసాయిదా తయారు చేసారు. ముసాయిదా తయారీలో ఎక్కువ శాతం పని కమిటీ చైర్మన్గా ఉన్న అంబేద్కరే చేసారు. అలా సుదీర్ఘమైన సంప్రదింపుల తర్వాత, ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాలనూ పరిశీలించి అత్యుత్తమమైనదిగా ఉండేలా మన రాజ్యాంగానికి రూపకల్పన చేసారు.
గణతంత్ర దినంగా జనవరి 26నే ఎందుకు ఎంచుకున్నారు? 1930లో జనవరి 26న భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు మొట్టమొదటిసారి మాకు సంపూర్ణ స్వరాజ్యం కావాలి అని అడిగారు. అలా పూర్ణ స్వరాజ్ కోసం కాంగ్రెస్ అడిగిన తేదీనే మన గణతంత్ర దినంగా నిర్ధారించారు.
మరో ఆసక్తికరమైన అంశం… స్వతంత్ర దినం నాడు మనం జెండా ఎగరవేస్తాం, గణతంత్ర దినం నాడు జెండా ఆవిష్కరించుకుంటాం. ఆగస్టు 15న మనకు పరాయి పాలకుల నుంచి స్వతంత్రం వచ్చింది. కాబట్టి జెండా ఆరోజు కిందనుంచి పైదాకా ప్రయాణించి, పైన ఎగురుతుంది. ఆవిధంగా ఎగురవేస్తాం. కానీ గణతంత్ర దినం నాటికి మన దేశానికి స్వతంత్రం వచ్చేసి కొంతకాలం గడిచిపోయింది. అందువల్ల ఆరోజు జెండాను కర్ర పైన ఉన్నదాన్ని తెరచి, ఆవిష్కరిస్తాం. అంటే మనకు స్వతంత్రం వచ్చేసింది, ఇంకా మనను మనం చిన్నచూపు చూసుకుని జెండాను కింద నుంచి ఎగరేయాల్సిన పనిలేదు. అందుకే రిపబ్లిక్ డే నాడు జెండాను ఆవిష్కరిస్తాం.