ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి భారత్, ఇండోనేషియా పరస్పర అంగీకారం తెలిపాయి. రక్షణ ఉత్పత్తుల తయారీ, వాణిజ్య రంగాల్లో పరస్పరం మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో , ప్రధాని మోదీ మధ్య జరిగిన సమావేశంలో ఈ మేరకు కీలక ఒప్పందాలు కుదిరాయి.
సుబియాంతో భారత రిపబ్లిక్ డే వేడుకలకు అతిథిగా హాజరుకానున్నారు.ఇందుకోసం మూడు రోజుల భారత పర్యటనకు వచ్చారు. ఈ సందర్బంగా ఇరుదేశాల మధ్య కీలక చర్చలు జరిగాయి. భారత్‌కు ఇండోనేషియా కీలక భాగస్వామి అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రక్షణ ఉత్పత్తుల తయారీ రంగంలో భారత్, ఇండోనేషియా కలిసి పని చేస్తాయన్నారు. సముద్ర రక్షణను బలోపేతం చేసే దిశగా ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది.
ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపర్చేందుకు ఇండోనేషియా సిద్ధంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు సుబియాంతో అన్నారు. ఫిన్‌టెక్, ఏఐ, ఐవోటీ, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు.