భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద కుట్రలో భాగస్వాములైనందుకు ఇద్దరు ఉగ్రవాదులకు అస్సాం గువాహటిలోని ఎన్ఐఎ ప్రత్యేక న్యాయస్థానం శిక్షలు విధించింది. భారత ఉపఖండంలో అల్‌ఖైదా (ఎక్యుఐఎస్) అనుబంధ సంస్థ, బంగ్లాదేశ్ కేంద్రంగా నడుస్తున్న అన్సరుల్లా బంగ్లా టీమ్ (ఎబిటి) అనే ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను నేరస్తులుగా నిర్ధారించింది.
ఎన్ఐఎ ప్రత్యేక న్యాయస్థానం మమునూర్ రషీద్‌కు మూడేళ్ళ కఠిన కారాగార శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించింది. అతనికే మరికొన్ని ఇతర నేరాలకు సంబంధించి అదనంగా సాధారణ జైలుశిక్ష కూడా విధించింది. ముకీబుల్ హుసేన్ అనే వ్యక్తికి ఆరు నెలల సాధారణ జైలుశిక్ష, రూ.ఐదువందల జరిమానా విధించింది. ఇతర నేరాలకు సంబంధించి అదనపు సాధారణ జైలు శిక్ష విధించింది.
ఈ దోషులపై మొదటగా 2022 మార్చిలో కేసు నమోదయింది. బంగ్లాదేశ్‌కు చెందిన సైఫుల్ ఇస్లామ్ అనే ఉగ్రవాది అస్సాంలోని బార్పేట కేంద్రంగా అన్సరుల్లా బంగ్లా టీమ్ మోడ్యూల్ నడుపుతున్నాడు. ఆ ఉగ్రవాద బృందంలో వీరిద్దరూ సభ్యులుగా ఉన్నారు. అల్‌ఖైదా ఇన్ ఇండియన్ సబ్‌కాంటినెంట్ (ఎక్యుఐఎస్) ఉగ్రసంస్థకు భారత్‌లో రిక్రూట్‌మెంట్లు జరపడం, ముస్లిములను అతివాదులుగా మార్చడం, అస్సాంలో ఎక్యుఐఎస్‌కు స్లీపర్ సెల్స్‌ను ఏర్పాటు చేయడం ఎబిటి బార్పేట మోడ్యూల్ ప్రధాన లక్ష్యాలు అని ఎన్ఐఎ దర్యాప్తులో తేలింది.
2022 ఆగస్టులో ఎన్ఐఎ 8మంది ఉగ్రవాద నిందితుల మీద ఛార్జిషీట్లు దాఖలు చేసింది. 2023 ఆగస్టులో మరో ఇద్దరి మీద అదనపు చార్జిషీట్లు దాఖలు చేసింది. అస్సాం పోలీస్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఇస్లామిక్ అతివాదులపై నిర్వహిస్తున్న ‘ఆపరేషన్ ప్రఘాత్’లో భాగంగా, బంగ్లాదేశ్‌కు చెందిన జిహాదీ నెట్‌వర్క్‌తో సంబంధాలున్న 14మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. దేశవ్యాప్తంగా పలుచోట్ల పేలుళ్ళు జరపడానికి ఉగ్రవాదులు పన్నిన కుట్రను అస్సాం ఎస్‌టిఎఫ్ భగ్నం చేసింది. వారి ఆయుధాలను, ఐఈడీని కూడా జప్తు చేసింది. 2024 డిసెంబర్ 17న ఒక మోస్ట్‌వాంటెడ్ బంగ్లాదేశీ ఉగ్రవాదిని కేరళలో అరెస్ట్ చేసింది.