భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వందో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 29న సాయంత్రం 6గంటల23 నిమిషాలకు నావిక్-2 ఉప గ్రహాన్ని ప్రయోగించనుంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్)లోని రెండో లాంచ్‌ప్యాడ్ నుంచి దీనిని ప్రయోగించనుంది. దాదాపు 2,500 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ ద్వారా నింగిలోకి పంపనున్నారు.
శ్రీహరికోటలో రాకెట్ కేంద్రం నిర్మించిన తర్వాత చేపడుతున్న వందో ప్రయోగం ఇది. దీంతో పాటు ఈ ప్రయోగానికి మరికొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. నింగిలోకి పంపనున్న నావిక్-2 ఉపగ్రహం నేవిగేషన్ ఉపగ్రహాల సిరీస్‌లో 9వది కావడం మరో విశేషం. నావిక్ సిరీస్‌లో రెండోది కాగా జీఎస్‌ఎల్వీ రాకెట్ సిరీస్‌లో 17వ ప్రయోగం.
పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన క్రయోజనిక్ ఇంజిన్‌తో 11వ సారి చేస్తున్న ప్రయోగంగాను దీనికి ప్రత్యేకతలు ఉన్నాయి. నావిక్ ప్రయోగంతో దేశంలోని వినియోగదారులకు కచ్చితమైన స్థానం, వేగం, సమయానుకూల సేవలు అందుతాయి. ఈ సిరీస్‌లో మరో మూడు ఉపగ్రహాలను ఈ ఏడాదిలోనే ప్రయోగించేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది.