వక్ఫ్ సవరణ బిల్లు 2024ను చర్చించేందుకు నియమించిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ సమావేశం రసాభాసగా జరిగింది. సమావేశంలో పాల్గొన్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ తనపై అన్‌పార్లమెంటరీ భాష (అసభ్య పదజాలం) ఉపయోగించారని జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్ ఆరోపించారు. ప్రతిపక్షాల రగడ కారణంగా సమావేశాన్ని రెండుసార్లు వాయిదా వేయాల్సి వచ్చిందని చెప్పారు. ఆ తర్వాత సమావేశం నుంచి ప్రతిపక్షాల నాయకులను సస్పెండ్ చేసారు.
‘‘సమావేశాన్ని రెండుసార్లు వాయిదా వేసాం. మేము ప్రతిపక్షం చేయాలనుకున్న సూచనల గురించి చెప్పడానికి మిర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్‌కు సమయం కేటాయించాం. కళ్యాణ్ బెనర్జీ నామీద అన్‌పార్లమెంటరీ భాష ఉపయోగించారు, నన్ను దూషించారు. ఆహ్వానితులను వరుసలో మాట్లాడనివ్వమంటూ నేను ఆయనకు పదేపదే విజ్ఞప్తి చేసాను. అయితే వాళ్ళు గొడవ చేయాలని మొండిపట్టుతో ఉన్నారు. మేం సమావేశాన్ని పదేపదే వాయిదా వేసాం. కానీ వాళ్ళు సమావేశం కొనసాగకూడదని కోరుకున్నారు. జమ్మూకశ్మీర్ నుంచి ఒక ప్రతినిధి బృందం వచ్చింది. కానీ విపక్ష ఎంపీలు అరుపులు, కేకలతో రచ్చరచ్చ చేసారు. చివరికి, వారిని సస్పెండ్ చేయాల్సిందిగా నిశికాంత్ దూబే తీర్మానం ప్రవేశపెట్టారు. దానికి అందరూ ఆమోదించారు’’ అని జగదాంబికా పాల్ చెప్పారు.
కశ్మీర్‌కు చెందిన ముస్లిం మతపెద్ద మిర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్‌ను ఈ సమావేశానికి పిలవాలని ప్రతిపక్షాలే కోరాయని, దానికి ఒప్పుకున్నామని జగదాంబికా పాల్ చెప్పారు. ఆయనకు మాట్లాడే అవకాశం కల్పించేందుకే నోటీస్ సబ్జెక్ట్‌ను మార్చామని, అది ఈ ఒక్కరోజుకే పరిమితమని ఆయన వివరించారు. నోటీస్ సబ్జెక్ట్‌ను మార్చామన్న సాకుతో ప్రతిపక్షాలు రచ్చ చేసాయి. ఇవాళ్టి అజెండాపై చర్చ జనవరి 27కు వాయిదా వేసామని వెల్లడించారు.
జేపీసీ సమావేశంలో రగడ చేసిన కారణానికి ఈ ఒక్కరోజుకూ పదిమంది ఎంపీలను సస్పెండ్ చేసారు. మొహమ్మద్ జవెయిద్, కళ్యాణ్ బెనర్జీ (టీఎంసీ), ఎ రాజా (డిఎంకె), అసదుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం), నాసిర్ హుస్సేన్, మొహీబుల్లా నద్వీ (ఎస్పి), ఎం అబ్దుల్లా (ఎస్పి), అరవింద్ సావంత్ (శివసేన-యుబిటి), నదీముల్ హక్ (శివసేన-యుబిటి), ఇమ్రాన్ మసూద్ (కాంగ్రెస్)
వక్ఫ్ సవరణ బిల్లు మీద జేపీసీ తన నివేదికను పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో సమర్పించాల్సి ఉంది. ఆ సమావేశాలు జనవరి 31న మొదలై ఏప్రిల్ 4 వరకూ కొనసాగుతాయి. కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెడతారు.