కేరళలో అడవి జంతువుల దాడులు ఎక్కువయ్యాయి. తాజాగా వయనాడ్ జిల్లాల్లో పెద్దపులి మహిళపై దాడి చేసి చంపి సగభాగం తినేసింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు.
వయనాడ్ జిల్లా మనంతవాడి సమీపంలోని కాఫీ తోటలో పనిచేస్తోన్న ఓ మహిళపై గురువారంనాడు పెద్ద పులి దాడి చేసింది. దీంతో రాధ అనే కూలీ మహిళ చనిపోయిందని స్థానికులు తెలిపారు.మహిళ చనిపోవడంతో మనంతవాడి ఎమ్మెల్యే మంత్రి కార్యాలయం ముందు నిరసనకు దిగారు. జనం పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొన్నారు. గడచిన ఐదేళ్లలో వయనాడ్ జిల్లాలోనే పది మంది అడవి జంతువుల దాడిలో చనిపోయారని మనంతవాడి ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. కేరళలో గడచిన ఐదేళ్లలో అడవి జంతువుల దాడులు తగ్గాయంటూ మంత్రి శశీంధ్రన్ వ్యాఖ్యానించిన మరసటి రోజే పెద్దపులి దాడిలో మహిళ ప్రాణాలు కోల్పోయింది.
కేరళలో అడవి జంతువులు జనావాసాలపై పడుతున్నాయి. అడవులు నరికివేయడం, అడవి జంతువులకు ఆహారం, నీరు లభించకపోవడంతో క్రూర మృగాల దాడులు ఎక్కువయ్యాయి. పెద్దపులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారని మంత్రి శశీంధ్రన్ వెల్లడించారు.