ఆరుగురు ముస్లిములు ఓ పిక్నిక్‌కు వెళ్ళారు. అక్కడ ఒక ఆవును కోసి చంపేసారు. తాము చేసిన ఘనకార్యాన్ని వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. ఆ వీడియో వైరల్ అయింది. దాంతో సామాన్య జనాల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఆ రాష్ట్రంలో గోవధను నిషేధిస్తూ చట్టం కూడా ఉంది. దాంతో పోలీసులు ఆ ఆరుగురినీ అరెస్ట్ చేసారు.
అస్సాం కామరూప్ జిల్లాలో అస్లాపరా ప్రాంతానికి చెందిన ఆరుగురు ముస్లిం యువకులు చైగన్ నదీతీర ప్రాంతానికి పిక్నిక్‌కు వెళ్ళారు. అక్కడ వారు ఒక ఆవును కోసి చంపేసారు. ఆ సంఘటనను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసారు. ఆ వీడియోను చూసిన చాలామంది ప్రజలు, ప్రత్యేకించి హిందువులు, తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తమ ఆవేదనను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. తమ విశ్వాసాల పట్ల పర మతస్తులకు సహనం లేకపోవడం గురించి హిందువులు బాధపడ్డారు. అలా ఆ వీడియో వైరల్ అయింది.
ఆ విషయం పోలీసుల దాకా చేరింది. అస్సాంలో క్యాటిల్ ప్రొటెక్షన్ యాక్ట్ 2021 అమల్లో ఉంది. దాంతో గువాహటి పోలీసులు ఆ నేరానికి పాల్పడిన యువకులను బుధవారం అరెస్ట్ చేసారు. ఆ విషయాన్ని అస్సాం డీజీపీ తన ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్‌లో ధ్రువీకరించారు. వారిలో ఐదుగురిని సాహిల్ ఖాన్, హఫీజుర్ ఇస్లాం, రకీబుల్ హుసేన్, జహీదుల్ ఇస్లాం, ఇజాజ్ ఖాన్ అనేవారిగా గుర్తించారు. వారిని విచారణ నిమిత్తం హతిగావ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అస్సాం ప్రభుత్వం ఇటీవల పశు సంరక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ నేపథ్యంలో ఈ వ్యక్తుల దుశ్చర్య ప్రజల దృష్టిని ఆకర్షించింది. రాష్ట్రంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో బీఫ్ తినకూడదని గత డిసెంబర్‌లో రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. చివరికి లాడ్జిలు, హోటళ్ళు, సామాజిక కార్యక్రమాల్లో సైతం బీఫ్ నిషేధించారు.