బిలియన్ ఓటర్లున్న దేశంగా భారత్ త్వరలో రికార్డు సృష్టించనుంది. ప్రస్తుతం దేశంలో ఓటర్ల సంఖ్య 99.1 కోట్లకు చేరుకుంది. ఇది త్వరలోనే 100 కోట్లకు చేరనుంది. ఈ నెల 25న జాతీయ ఓటరు దినోత్సవం నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల లెక్కలను వెల్లడించింది.
గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల సమయంలో 96.88 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఈ ఏడాదికి వచ్చే సరికి ఇంకా పెరిగారు. మొత్తం ఓటర్లలో 21.7 కోట్ల మంది 18-29 ఏళ్ల మధ్య వయసున్న ఉన్నవారు ఉండటం విశేషం.
2024తో పోలిస్తే 2025లో స్త్రీ, పురుష ఓటర్ల నిష్పత్తిలో తేడా తగ్గింది. గత ఏడాది ప్రతీ వెయ్యిమంది పురుష ఓటర్లకు 948 మంది మహిళలుండగా 2025 నాటికి అది 954కు పెరిగింది.
2011 నుంచి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. జనవరి 25న 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకోనుంది. ఈ సందర్బంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. భారత్ గణతంత్ర రాజ్యంగా ఏర్పడానికి ఒక రోజు ముందు అంటే 1950 జనవరి 25న ఎన్నికల సంఘం ఏర్పాటైంది. ఈ ఏడాది జనవరి 25నాటికి ఎన్నికల సంఘం ఏర్పడి 75 ఏళ్ళు అవుతుంది.