మహారాష్ట్రలో భారీ పేలుడు జరిగింది. భండారా జిల్లాలో చోటుచేసుకున్న భారీ పేలుడులో ఐదుగురు చనిపోయారు. ఓ ఆయుధ తయారీ కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడినట్లు తెలుస్తోంది. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు పేలుడు జరిగిందని పోలీసులు తెలిపారు.
పేలుడు ధాటికి ఫ్యాక్టరీ పైకప్పు లేచిపోయింది. పేలుడు శబ్దం ఐదు కిలోమీటర్ల వరకు వినిపించిందని స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. ఆ సమయంలో ఫ్యాక్టరీలో 22 మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో ఇద్దరిని కాపాడినట్లు తెలుస్తోంది. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.
ప్రమాద విషయం తెలియగానే భండారా జిల్లా కలెక్టర్ సంజయ్ అధికారులను అప్రమత్తం చేశారు. గాయపడిన వారిని సమీపంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పేలుడు కారణాలు తెలియాల్సి ఉంది.