ఇరాక్ పార్లమెంటు జనవరి 21న 3 వివాదాస్పద చట్టాలను ఆమోదించింది, తద్వారా కుటుంబ వ్యవహారాల్లో ఇస్లామిక్ న్యాయాన్ని అమలు చేయడం ప్రారంభించింది. వాటిలో ప్రధానమైనది, తీవ్రంగా చర్చలకు దారి తీసింది ఏంటంటే పర్సనల్ స్టేటస్ లా అనే చట్టంలో చేసిన సవరణలు. తద్వారా చిన్నారి బాలికల వివాహాలను సైతం చట్టబద్ధం చేసేయవచ్చు. ఇస్లామిక్ చట్టాన్ని తమకు తోచినట్లు వ్యాఖ్యానించడం ద్వారా కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు మతగురువులకు ఆ చట్టం విశేష అధికారాలను ఇస్తోంది.
పర్సనల్ స్టేటస్ లాకు ఇరాక్ పార్లమెంటు చేసిన సవరణలు మహిళా హక్కులను అణగదొక్కేసేలా ఉన్నాయన్న తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ చట్టంలో తాజాగా చేసిన సవరణల ద్వారా, జాఫరీ స్కూల్ ఆఫ్ ఇస్లామిక్ లా ప్రకారం 9ఏళ్ళ వయసున్న అమ్మాయికి పెళ్ళి చేసేయవచ్చు. ఇది ప్రస్తుతం అమల్లో ఉన్న ‘అమ్మాయిలకు కనీస వివాహ వయస్సు 18ఏళ్ళు’ అనే చట్ట నిబంధనకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఈ సవరణను షియా ఛాందసవాదులు పూర్తిగా సమర్ధించారు. పాశ్చాత్య సంస్కృతి ప్రభావాన్ని నిరోధించడానికి, ఇస్లామిక్ నియమాలను వ్యక్తులపై మరింత బలంగా రుద్దడానికీ, 9ఏళ్ళకే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేయాలన్నది వారి వాదన. కానీ మానవ హక్కుల వాదులు, ఇరాకీ వుమెన్స్ లీగ్‌కు చెందిన ఇంతిసార్ అల్ మయాలీ వంటివారు ఈ చట్ట సవరణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వివాహం, విడాకులు, భరణం, కస్టడీ వంటి విషయాల్లో మహిళల హక్కులను తొలగిస్తారని వారు ఆదుర్దా పడుతున్నారు. అదే జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
నిజానికి ఆ చట్టాల ఆమోదం కోసం జరిగిన పార్లమెంటు సమావేశంలో విధివిధానాలను సైతం సరిగ్గా పాటించలేదు. సభకు సరైన కోరం లేదు, మూడు వేర్వేరు బిల్లుల మీద ఒకేసారి ఓటింగ్ నిర్వహించారు. దానివల్ల ఓటింగ్‌లో అవకతవకలు చోటు చేసుకున్నాయి. స్వతంత్ర ఎంపీ రయీద్ అల్ మలికీ ఆ అవకతవకలపై అభ్యంతరం వ్యక్తం చేసారు. అయినప్పటికీ స్పీకర్ మొహమ్మద్ అల్ మషాదనీ ఆ సవరణను సమర్ధించారు. సమాజ వ్యవస్థీకరణ, న్యాయం దిశలో గొప్ప ముందడుగు అంటూ ప్రశంసించారు.
ఇరాక్ ప్రభుత్వం షరియా చట్టాన్ని ఈవిధంగా అమల్లోకి తీసుకురావడం వల్ల మహిళలు, మైనారిటీల హక్కులు హరించుకుపోతాయి. బాల్యవివాహాలు పెరిగిపోతాయి. ఆడపిల్లలకు విద్యా, ఉద్యోగ అవకాశాలు నశించిపోతాయి అని ఇరాకీ మహిళలు ఆందోళన చెందుతున్నారు.