హిందువులు పాటించాల్సిన ఆచారాలు, ధర్మాలు, సామాజిక జీవితంలో అనుసరించాల్సి నియమాలపై ప్రవర్తనా నియమావళి సిద్ధమవుతోంది. ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో కాశీ విద్వత్ పరిషత్ ఆధ్వర్యంలో నియమావళికి ముసాయిదా సిద్ధమవుతోంది.
సనాతన ధర్మాన్ని పాటించే వారు తప్పకుండా చేయాల్సినవి, చేయకూడనవి ఈ నియమావళిలో పొందుపరుస్తారు.
నియమావళి ముసాయిదా దాదాపు 300 పేజీలు ఉందని, దానిలోని అంశాలను విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శనివారం నుంచి జరిగే సమావేశంలో రుషులు, స్వాములు, సనాతనమతపెద్దలతో చర్చిస్తారు.
సాధువులు సహా శంకరాచార్యుల ధ్రువీకరణ తర్వాత ముద్రించిన ప్రతులను మహాకుంభమేళాలో భక్తులకు పంపిణీ చేస్తారు.
హిందూ ప్రవర్తనా నియమావళి మేరకు సూర్యుని సమక్షంలో పగటిపూట వివాహం చేసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నట్లు సమాచారం. అలాగే భ్రూణ హత్యలు, వరకట్నం స్వీకరణను వ్యతిరేకించడం వంటి అంశాలను నియమావళిలో పేర్కొన్నారు. లింగభేదం పాటించకపోవడంతో పాటు యజ్ఞ యాగాదులు వంటివి చేయడానికి అర్హులేనని పొందుపరిచారు. అలాగే అంటరానితనాన్ని వ్యతిరేకించడం అన్ని కులాల వారికీ దేవాలయాల ప్రవేశం కల్పించాలని పేర్కొననున్నారు.