జమ్ముకశ్మీర్‌లోని అనుమానాస్పద మరణాలపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. బుదాల్ గ్రామంలో నెల రోజుల వ్యవధిలో 17 మంది మరణించడానికి బ్యాక్టీరియా, వైరస్లు కారణం కాదని పరీక్షల్లో తేలిందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. గ్రామస్థుల మరణానికి కారణం త్వరలో తేలుతుందన్నారు.
ఇప్పటికే కేంద్ర బృందం బుదాల్ గ్రామాన్ని పరిశీలించింది. గ్రామంలో ఇటీవల జరిగిన సామూహిక వేడుకల్లో తీసుకున్న ఆహారంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో వేడుకలు నిషేధించారు. ఇళ్లలో ఇప్పటికే నిల్వ ఉంచిన ఆహారం తీసుకోవద్దని సూచించారు. తాము సరఫరా చేసే ఆహారం మాత్రమే తీసుకోవాలని అధికారులు కోరారు. గ్రామంలోనికి ఇతర ఆహార పదార్ధాలు రాకుండా కట్టడి చేశారు. గ్రామస్థుల మరణాలకు కారణాలను అన్వేషించే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు.
జమ్ముకశ్మీర్ మిస్టరీ మరణాలపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకే గ్రామంలో నెల రోజుల వ్యవధిలో 17 మంది చనిపోవడం వెనుక కుట్ర దాగి ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. గ్రామస్థులు తీసుకున్న ఆహారంలో విషం కలిపి ఉండవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. దీనిపై కేంద్రం లోతుగా దర్యాప్తు చేస్తోంది.