ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా ప్రపంచదేశాలను ఆకర్షిస్తోంది. తాజాగా ఇవాళ రష్యా, ఉక్రెయిన్ దేశాలకు చెందిన సాధువులు ప్రయాగరాజ్‌లో భజనలు, కీర్తనలతో ప్రార్థనలు చేసారు. పరస్పరం యుద్ధం చేసుకుంటున్న రష్యా, ఉక్రెయిన్ దేశాలకు చెందిన సాధువులు కలిసి సంకీర్తనలు ఆలపించడం ద్వారా ఆధ్యాత్మిక ఐకమత్యాన్ని ప్రదర్శించారు.
ఆ సందర్భంగా మహంత్ సనత్కుమార మాట్లాడుతూ ‘‘భగవాన్ దత్తాత్రేయుడి గురుపరంపర పూజ నిర్వహించాం. దాని తర్వాత శివభగవానుడికి, గణపతికి హారతి ఇచ్చి, భజనలు ఆలపించాం. కొందరు అతిథులు కూడా పాల్గొన్నారు. వారు శివుడు, రాముడి మీద భజనలు పాడారు. ఇది ఐకమత్యానికి చిహ్నం. భారతీయ, పాశ్చాత్య సంస్కృతులు కలిసి పనిచేయగలవని వారు నిరూపించారు. ప్రజలు అందరూ కలిసి జీవించగలరు అనే సందేశమిది. సనాతన ధర్మం అంటే ఐకమత్యం, సహకారం అని ఈ సంఘటన నిరూపించింది’’ అని చెప్పారు.
ప్రపంచ శాంతి గురించి సందేశాన్ని వ్యాపింపజేయడంలో మహాకుంభమేళా గొప్ప సందర్భమని మహంత్ సనత్కుమార వ్యాఖ్యానించారు. ‘‘కుంభమేళా జరుగుతున్న ఈ పవిత్ర భూమి నుంచి నేను శాంతి కోసం ప్రార్ధిస్తున్నాను. ప్రపంచంలో జరుగుతున్న అన్ని యుద్ధాలూ ముగిసిపోవాలి. ప్రత్యేకించి ఉక్రెయిన్, రష్యా మధ్య ఘర్షణలు తొలగిపోవాలి. ఒక సాధువుగా నేను ఈ ప్రపంచ సంక్షేమాన్ని, శాంతినీ కోరుకుంటున్నాను’’ అన్నారు.
ఈ ఉదయం బీజేపీ నాయకుడు నితిన్ పటేల్ ప్రయాగరాజ్ వెళ్ళారు, మహాకుంభమేళాలో పాల్గొన్నారు. జీవితంలో ఒక్కసారి లభించే అరుదైన అవకాశమంటూ హర్షం వ్యక్తం చేసారు. ‘‘భారతీయులకు, అందునా సనాతన ధర్మాన్ని అనుసరించే వారికి ఇది జీవితంలో ఒక్కసారి లభించే గొప్ప అవకాశం. ఈ మహాకుంభమేళాకు కోట్లమంది ప్రజలు వస్తున్నారు. నేను నా కుటుంబంతో కలిసి ఇవాళ పవిత్రస్నానం చేసాను. మహాకుంభమేళా ఈ రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. దీన్ని ఎవరూ రాజకీయ కోణంలో చూడకూడదు’’ అన్నారు.
మహాకుంభమేళా ప్రారంభమై నేటికి 11 రోజులు గడిచింది. ఫిబ్రవరి 26 వరకూ జరిగే ఈ మేళాలో కనీసం 45కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరిస్తారని అంచనా. బుధవారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆయన మంత్రివర్గ సహచరులతో కలిసి పవిత్ర స్నానాలు ఆచరించారు. కుంభమేళాలోని నాలుగు ముఖ్యమైన రోజుల్లో ఒకటైన జనవరి 29 మౌని అమావాస్య రోజున త్రివేణీ సంగమానికి జనసముద్రం పోటెత్తుతుందని అంచనా వేస్తున్నారు. ఆ మేరకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.