ఉత్తరాఖండ్ ప్రభుత్వం మంగళవారం జనవరి 21న ఉమ్మడి పౌర స్మృతిని (యూనిఫాం సివిల్ కోడ్ – యూసీసీ) నోటిఫై చేసింది. అందులో వివాహ నిబంధనలు, వ్యక్తిగత హక్కుల రక్షణ వంటి అంశాలపై చట్టపరంగా స్పష్టతనిచ్చే అంశాలు ఉన్నాయి.
రాష్ట్రప్రభుత్వం ప్రకటన ప్రకారం, ఆ చట్టం ఉత్తరాఖండ్ అంతటికీ వర్తిస్తుంది. అంతేకాక, రాష్ట్రం వెలుపల నివసిస్తున్న ఉత్తరాఖండ్ వాసులకు కూడా వర్తిస్తుంది. యూసీసీని దేశంలో మొట్టమొదట అమలు చేసిన రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. యూసీసీ అనేది వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం, భరణం వంటి అంశాలకు సంబంధించిన వ్యక్తిగత చట్టాలను సరళీకరించి, వాటిని ప్రామాణీకరించే పని చేస్తున్నారు.
యూసీసీ ఉత్తరాఖండ్‌లో ఎస్టీలు, మరికొన్ని ప్రత్యేక వర్గాలకు మినహాయింపు ఇచ్చింది. వారు ఈ చట్టం పరిధిలో అసలు లేనే లేరు. వారు తప్ప రాష్ట్రంలోని అందరు ప్రజలకూ యూసీసీ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
పెళ్ళిళ్ళకు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియలను సరళీకరించి, క్రమబద్ధీకరించడానికి ఒక ప్రజాసంక్షేమ పద్ధతిని ఆ చట్టంలోనే సమకూర్చారు.
ఆ చట్టం ప్రకారం వివాహ సంస్కారాన్ని ఇద్దరు వ్యక్తుల మధ్య జరిపిస్తారు. వారిలో ఏ ఒక్కరికీ సజీవంగా ఉన్న జీవిత భాగస్వామి ఉండకూడదు. వారిద్దరూ వివాహానికి చట్టబద్ధమైన అనుమతి ఇవ్వడానికి మానసిక సామర్థ్యం కలిగి ఉండాలి. పురుషుడికి 21ఏళ్ళు, మహిళకు 18ఏళ్ళు నిండి ఉండాలి. వారిద్దరూ ఇతర నిషిద్ధ సంబంధాల్లో ఉండకూడదు.
పెళ్ళి ఆచారాలు ఏ విధంగానైనా ఉండవచ్చు. ఆ వ్యక్తుల మతపరమైన ఆచారాలు లేదా రాజ్యాంగబద్ధమైన మరే ఇతర పద్ధతికైనా లోబడి పెళ్ళి చేసుకోవచ్చు. అయితే ఈ చట్టం అమల్లోకి వచ్చిన రోజు నుంచీ 60 రోజులలోగా పెళ్ళిని రిజిస్టర్ చేయడం తప్పనిసరి. 2010 మార్చి 26 తర్వాత జరిగిన పెళ్ళిళ్ళు అన్నింటినీ ఈ చట్టం ప్రకారం 6 నెలల్లోగా తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు తమ పెళ్ళిని మళ్ళీ రిజిస్టర్ చేసుకోనక్కరలేదు. కానీ గతంలో రిజిస్టర్ చేసుకున్నట్లు ఆధారం చూపాలి.
2010 మార్చి 26కు ముందు జరిగిన పెళ్ళిళ్ళు లేదా అప్పటినుంచీ చేస్తున్న సహజీవనాలను కూడా ఈ చట్టం అమల్లోకి వచ్చిన 6 నెలల్లోపు రిజిస్టర్ చేసుకోవచ్చు, కానీ అది తప్పనిసరి కాదు. దరఖాస్తు అందిన 15 రోజుల్లోగా సబ్ రిజిస్ట్రార్ తగిన నిర్ణయం తీసుకోవాలి. లేనిపక్షంలో ఆ దరఖాస్తు ఆటోమేటిక్‌గా రిజిస్ట్రార్‌కు వెళ్ళిపోతుంది. అలా కాక 15 రోజులలో ఆ దరఖాస్తును తిరస్కరిస్తే దానిపై అప్పీల్ చేసుకోవచ్చు. తప్పుడు సమాచారం ఇస్తే వారికి జరిమానా విధించే ఆస్కారం ఉంది. అయితే రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అన్న ఒకే ఒక కారణానికి పెళ్ళి చెల్లనిది అయిపోదు. ఈ రిజిస్ట్రేషన్ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ రెండు పద్ధతుల్లోనూ చేసుకోవచ్చు.
ఈ ప్రక్రియను జరిపించడానికి రాష్ట్రప్రభుత్వం రిజిస్ట్రేషన్ల కోసం ప్రత్యేకంగా ఒక రిజిస్ట్రార్ జనరల్‌ని, సబ్ రిజిస్ట్రార్‌ను నియమిస్తుంది. వారు ఈ చట్టం అమలు క్రమాన్ని పర్యవేక్షిస్తారు.