మహిళల అండర్ 19 టీ20 ప్రపంచకప్ పోటీల్లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. గ్రూప్-A విభాగంలో భాగంగా ఆడిన మూడు మ్యాచులలోనూ విజయం సాధించిన భారత యువతుల జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది.
కౌలాలంపూర్ వేదికగా సాగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక, భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. భారత ఓపెనర్ గొంగడి త్రిష(49 )తో ఈ మ్యాచ్ లో అత్యధిక పరుగులు చేసింది. మరో ఓపెనర్ కమలిని(5) తొలి వికెట్ గా వెనుదిరిగింది. దీంతో 17పరుగులు వద్ద భారత్ మొదటి వికెట్ నష్టపోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సనికా కూడా విఫలమైంది.
ప్రముది బౌలింగ్ లో డకౌట్ గా పెవిలియన్ చేరింది. మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన నికీ ప్రసాద్ (11) పరుగులు చేసి ఔట్ అయింది. జట్టు స్కోర్ 48 పరుగులు వద్ద ఉన్నప్పుడు అసెని బౌలింగ్ లో ఆమె వెనుదిరిగింది.
ఆ తర్వాత మనుది బౌలింగ్ లో త్రిష క్యాచ్ ఔట్ గా దొరికిపోయింది. భవిక అహిరే(7) , మిథిల(16 ), ఆయుషి (5), జోషిత (14), పరుణిక ( 1) విఫలమయ్యారు. మ్యాచ్ ముగిసే సమయానికి షబ్నమ్(2*), వైష్ణవి శర్మ(1*) క్రీజులో ఉన్నారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది.
శ్రీలంక బౌలర్లలో లిమాంస తిలకరత్న, ప్రముది, అసెని తలో 2 వికెట్లు పడగొట్టారు. మనుది, రష్మిక, ప్రబోధ తలో వికెట్ తీశారు.
భారత్ విధించిన 119 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన శ్రీలంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.ఓపెనర్ సుముదు భారత బౌలర్ షబ్నమ్ వేసిన 0.2 బంతికి డకౌట్ అయింది. దీంతో జట్టు స్కోర్ 1 పరుగు వద్ద తొలి వికెట్ కొల్పోయింది. ఆ తర్వాత జట్టు స్కోర్ 5 పరుగుల వద్ద ఉన్నప్పుడు మరో ఓపెనర్ సంజన (5) జోషిత బౌలింగ్ లో ఔట్ అయింది. దహమి(0) కూడా షబ్నమ్ బౌలింగ్ లోనే వెనుదిరగగా , హిరుణి(2) మనుది(2) కూడా విఫలమయ్యారు. రష్మిక(15), లిమాంస(6), శశిని(3), ఆసేని(9) వెనుదిరిగారు. ఆట ముగిసే సమయానికి క్రీజులో ప్రముది(7)చాముది ( 2)ఉన్నారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 58 పరుగులు చేసింది. దీంతో భారత్ 60 పరుగుల తేడాతో విజయం సాధించింది.
భారత బౌలర్లలో షబ్నమ్, పరుణిక, జోషిత తలా రెండు వికెట్లు తీశారు. ఆయుషి, వైష్ణవి చెరొక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.