అమెరికాలో కార్చిచ్చు మరోసారి విస్తరిస్తోంది. లాస్ ఏంజలెస్ ప్రాంతంలో 60 వేల ఎకరాల అడవి, 14 వేల ఇళ్లను దహనం చేసిన కార్చిచ్చు తాజాగా కొత్త ప్రాంతాలకు విస్తరించింది. బుధవారం నాడు…కాస్టాయిక్ లేక్ ప్రాంతంలో కొత్తగా మంటలు అంటుకున్నాయి. గడచిన 24 గంటల్లోనే 40 వేల ఎకరాల్లో అడవి కాలిపోయింది. తాజాగా 3 వేల ఇళ్లు కాలిపోయాయి. 15 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
కాస్టాయిక్ లేక్ ప్రాంతంలో మంటలు ఆర్పేందుకు విమానాలు, హెలికాఫ్టర్ ద్వారా నీటి బాంబులు విసురుతున్నాయి. ఫైర్ ఫైటర్స్ నిరంతరం పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు.మెక్సికో, కెనడాల నుంచి కూడా 5 వేల మంది ఫైర్ ఫైటర్స్‌ను రప్పించారు. ఇప్పటికే అమెరికాలో కార్చిచ్చు కారణంగా 26 లక్షల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందని అమెరికా ప్రకటించింది.
కాస్టాయిక్ లేక్ ప్రాంతంలో గంటకు 67 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. గురువారం నాటికి గాలి వేగం 97 కి.మీటర్లకు పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. గాలుల వేగానికి మంటలు వ్యాపిస్తున్నాయని అధికారులు తెలిపారు. మంటలు అదుపులోకి వచ్చాయనుకునే సమయంలో మరోసారి కాస్టాయిక్ లేక్ ప్రాంతంలో విస్తరించడంతో స్థానికుల్లో మరలా ఆందోళన మొదలైంది.