ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాల్లో జరిగిన రైలు ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. 15 మంది గాయపడ్డారు. ముంబైకి 400 కి.మీ దూరంలో ఈ ఘటన జరిగింది. మహేజి పర్ధాడె స్టేషన్ల మధ్య సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు ఈ ఘోరం చోటు చేసుకుంది. లఖ్నవూ ముంబై పుష్పక్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయని కలకలం రేగింది. భయంతో కొందరు చైన్ లాగారు. బండి ఆగిపోగానే పక్కనే ఉన్న రైలు పట్టాలపైకి చేరారు. అటుగా వేగంగా దూసుకొచ్చిన బెంగళూరు న్యూదిల్లీ కర్ణాటక ఎక్స్ప్రెస్ వారిపై నుంచి వెళ్లింది.
ఘటనా ప్రాంతంలోనే 12 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ట్రాకు వైపు దిగిన వారు ప్రమాదానికి గురయ్యారని ప్రమాదం నుంచి బయటపడ్డవారు చెప్పారు.మలుపు ఉన్న ప్రాంతం కావడంతో ఫైలట్కు ఎక్కువ దూరం కనిపించే అవకాశం కూడా లేదు. దీంతో రైలు గంటకు 120 కి.మీ వేగంతో దూసుకెళ్లింది. ఫైలెట్లు అన్ని నిబంధనలు పాటించారని రైల్వే అధికారులు తెలిపారు.
పుష్పక్ రైలు బ్రేకులు పట్టేయడంతో పొగలు వచ్చినట్లు ప్రయాణీకులు చెబుతున్నారు. దీంతో వారు భయాందోళనకు గురయ్యారని అధికారులు కూడా గుర్తించారు. ప్రమాద ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్ విచారం వ్యక్తం చేశారు. రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.