ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
తిరుపతిలో వైకుంఠ దర్శన టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి నేతృత్వంలో జ్యుడిషియల్ విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద జనవరి 8న జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. ప్రమాద ఘటనను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా పరిగణించారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.