రాజస్థాన్‌లో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 17 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసారు. వాటిలో 9 జిల్లాలను ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది. వాటితో పాటే కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు చేసిన 3 అదనపు డివిజన్లను కూడా రద్దు చేసింది. ప్రభుత్వ చర్యను ఖండిస్తూ ముస్లిములు షాపురా పట్టణంలో మంగళవారం నాడు నిరసన ర్యాలీ నిర్వహించారు.
ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆ 9 జిల్లాల ఏర్పాటు వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగమూ లేదని, వాటి ఏర్పాటు ప్రాయోగికంగానూ ఆచరణసాధ్యం కాదనీ ప్రకటించింది. అలా రద్దు చేసిన జిల్లాల్లో షాపురా ఒకటి. అక్కడి ముస్లిములు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆక్రోశ్ ర్యాలీ పేరిట నిరసన ప్రదర్శన చేపట్టారు. ముఖ్యమంత్రికి, స్థానిక ఎమ్మెల్యే లాలారాం బేవరాకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. జిల్లా బచావో సంఘర్ష్ సమితి, ప్రాపర్టీ డీలర్ అసోసియేషన్, పట్టణంలోని బార్ అసోసియేషన్ ప్రతినిధులు, మునిసిపాలిటీ కౌన్సిలర్లు ఆ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్థాన్‌లోని జిల్లాలను పునర్‌వ్యవస్థీకరించి 17 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. అయితే వాటిలో 9 జిల్లాల ఏర్పాటు అనవసరమంటూ ప్రస్తుత బీజేపీ సర్కారు వాటిని రద్దు చేసింది. అనూప్‌గఢ్, దూడూ, గంగాపూర్ సిటీ, జైపూర్ గ్రామీణ, జోధ్‌పూర్ గ్రామీణ, కేక్రీ, నీమ్ కా థానా, సంచోరే, షాపురా అనే ఆ 9 జిల్లాల నిర్వహణ ఆచరణసాధ్యం కాదనీ, అందులో ప్రజాహితం ఏమీ లేదనీ వెల్లడిస్తూ ఆ జిల్లాలను 2024 డిసెంబర్ 28న రద్దు చేసింది. బీజేపీ ప్రభుత్వ చర్యపై కాంగ్రెస్ విరుచుకుపడుతోంది. ఆ క్రమంలోనే షాపురాతో పాటు ఆయా ప్రాంతాల్లో ముస్లిములు, కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.