ఝార్ఖండ్‌లోని భొకారో జిల్లాలో భద్రతా బలగాలు ఈ ఉదయం ఇద్దరు మావోయిస్టులను తుదముట్టించారు. వారిలో ఒకరు ఏరియా కమాండర్ అని గుర్తించారు.
ఝార్ఖండ్ పోలీసులు, 209 కోబ్రా బెటాలియన్ కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఇంటలిజెన్స్ బ్యూరో, స్థానిక అధికారులు ఇచ్చిన కచ్చితమైన సమాచారం మేరకు మావోయిస్టులపై దాడి చేసారు. ఈ ఆపరేషన్‌లో మూడు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఒకటి ఎకె-47, రెండు ఇన్సాస్ రైఫిల్స్ ఉన్నాయి.
హతుల్లో శాంతి అనే మావోయిస్టు ఏరియా కమాండర్ గిరిధ్ జిల్లాలోని ఛత్రో గ్రామస్తురాలు, మనోజ్ అదే జిల్లాకు చెందిన ధవతర్ గ్రామస్తుడు అని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
మరోవైపు, ఝార్ఖండ్‌లోని చాయ్‌బసా వద్ద మావోయిస్టుల స్థావరంపై దాడి చేసిన భద్రతా బలగాలు 21 ఐఈడీ పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ సింగ్భమ్ జిల్లాలోని సెరెంగ్డా అడవుల్లో ఉన్న మావోయిస్టుల స్థావరాన్ని పోలీసులు కనుగొన్నారు. అక్కడ 21 ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజెస్ (ఐఈడీ), 55 జిలెటిన్ స్టిక్స్ లభ్యమయ్యాయి.
ఛత్తీస్‌గఢ్-ఒడిషా సరిహద్దులో నిన్న జనవరి 21న భారీ ఎన్‌కౌంటర్ జరిగిన మర్నాడే, ఇవాళే ఈ ఎన్‌కౌంటర్ జరగడం గమనార్హం. నిన్నటి ఎన్‌కౌంటర్‌లో కనీసం 20మంది మావోయిస్టులను ఛత్తీస్‌గఢ్ పోలీసులు తుదముట్టించారు. వారిలో ఒక ఉన్నతస్థాయి మావోయిస్టు నేత తల మీద రూ.కోటి రివార్డు ఉంది.