కేరళలో బహుళ జనాదరణ పొందిన ‘మల్టీ ఎక్సర్సైజ్ కాంబినేషన్ (ఎంఇసి-7)’ అనే ఫిజికల్ ఫిట్నెస్ ప్రోగ్రామ్‌ను ఆ రాష్ట్రంలో ప్రముఖ ఇస్లామిక్ బోధకుడైన కంఠాపురం అబూబకర్ ముస్లియార్ తప్పుపట్టారు. సీపీఎం సమర్థకుడైన అబూబకర్, ఆ ఫిట్నెస్ కార్యక్రమంలో స్త్రీపురుషులు కలిసి పాల్గొంటారు కాబట్టి అది ఇస్లామిక్ నియమాలకు వ్యతిరేకం అని సూత్రీకరించారు.
‘‘ఈమధ్య వ్యాయామం పేరిట ఒక ప్రాజెక్టు ప్రారంభమైంది. అది రాష్ట్రంలోని ప్రతీ పట్టణంలోనూ, ప్రతీ గ్రామంలోనూ జరుగుతోంది. దాని గురించి మేము వాకబు చేసినప్పుడు ఆ కార్యక్రమంలో స్త్రీ పురుషులు కలిసి పాల్గొంటారని తెలిసింది. అంతేకాదు. ఈ వ్యాయామాలు చేసేటప్పుడు స్త్రీలు తమ శరీరాలను ఎక్స్పోజింగ్ చేస్తారు. అసలు స్త్రీ పురుషులు ఒకరిని ఒకరు చూడడమే నిషిద్ధం. ఆ సూత్రాన్నే ఈ కార్యక్రమం రద్దు చేసేస్తోంది’’ అని అబూబకర్ వ్యాఖ్యానించారు.
ఈ విషయాలను ప్రస్తావిస్తే తనను పాతకాలపు ఆలోచనలు ఉన్నవాడిగా విమర్శిస్తున్నారని అబూబకర్ ఆరోపించారు. ‘‘ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తే చాలు, వారికి ఎలాంటి అవగాహనా లేదని విమర్శిస్తున్నారు. వ్యాయామం మంచిది కాదా అని ప్రశ్నిస్తున్నారు. మేము ఈ ప్రపంచాన్ని అర్ధం చేసుకోలేదంటూ మమ్మల్ని దూషిస్తున్నారు’’ అని అబూబకర్ ఆరోపించారు. అబూబకర్, ఆలిండియా సున్నీ జమియ్యతుల్ ఉలేమా సంస్థ ప్రధాన కార్యదర్శి, ముస్లిములలలోని సున్నీ విభాగానికి చెందిన శక్తివంతమైన నాయకుడు.
ఈ ఎంఇసి-7 కార్యక్రమం మొదటినుంచీ వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంది. గత అక్టోబర్‌లో ఒక సీపీఎం సీనియర్ నాయకుడు ‘ఈ కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకుని ఛాందసవాదులు భారత్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చేయాలని ప్రచారం చేస్తున్నారు’ అని ఆందోళన వ్యక్తం చేసాడు. కోళికోడ్ జిల్లా సీపీఎం కార్యదర్శి పి మోహనన్ మాట్లాడుతూ కేరళలోని పలు ప్రాంతాల్లో జమాతే ఇస్లామీ సంస్థ నిషిద్ధ ఉగ్రవాద సంస్థ పిఎఫ్ఐ సహకారంతో శరీర వ్యాయామ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోందని హెచ్చరించాడు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకోవద్దంటూ, మతపరమైన అతివాదులు బహిరంగ ప్రదేశాల్లోకి వ్యాయామం పేరిట చొచ్చుకొచ్చేస్తున్నారని వివరించాడు.