వక్ఫ్ (సవరణ) చట్టంపై ఏర్పడిన సంయుక్త పార్లమెంటరీ సంఘానికి, దేశంలోని అన్ని మతాల ధార్మిక ఆస్తుల కోసం ఒకే చట్టం తీసుకురావాలని విశ్వహిందూ పరిషత్ ప్రతిపాదించింది. ముస్లిముల కోసం మాత్రమే కాకుండా, అన్ని మతాలకూ ఆ చట్టం వర్తించాలని సూచించింది. ఆ మేరకు విశ్వహిందూ పరిషత్ జేపీసీకి లేఖ రాసింది.
“పవిత్రము, ధార్మికము లేక దాతృత్వము అని గుర్తించిన నిర్దిష్ట ప్రయోజనాల కోసం శాశ్వతంగా అంకితం చేసిన స్థిర లేదా చర ఆస్తిని వక్ఫ్ అని ముస్లిం చట్టం నిర్వచిస్తుంది. అక్కడ ఆ అంకితం అల్లాను ఉద్దేశించినది. ఒకసారి ఆస్తిని అలా అంకితం చేస్తే, అది అల్లా ఆస్తిగా మారుతుంది, ఆయన ఆధీనంలో ఉంటుంది.”
హిందువులు తమ దేవాలయాల నిర్వహణ కోసం, పవిత్రం ధార్మికం లేక దాతృత్వంగా గుర్తించే ప్రయోజనాల కోసం స్థిర లేదా చర ఆస్తులను దేవతలకు అంకితం చేస్తారు. క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు తదితర మతాలను అనుసరించే వారు కూడా తమ మతం పవిత్రం ధార్మికం లేక దాతృత్వంగా గుర్తించే ప్రయోజనాల కోసం తమ ఆస్తులను అంకితం చేస్తారు.
భారత రాజ్యాంగంలోని 44వ అధికరణం, “దేశమంతటా పౌరుల కోసం ఏకరీతీ పౌర స్మృతిని అమలు చేయడానికి రాజ్యం ప్రయత్నించాలి” అని చెబుతోంది. కాబట్టి అన్ని మతాలకూ సమానంగా వర్తించేలా ధార్మిక ఆస్తుల కోసం ఒకే చట్టం ఉండాలని విహెచ్‌పి తమ లేఖలో జేపీసీకి వెల్లడించింది.
వక్ఫ్ చట్టం 1954 చరిత్ర:
1954లో వక్ఫ్ బిల్లును ప్రభుత్వం కాకుండా, సి మహమ్మద్ అహ్మద్ కాజ్మీ అనే ఎంపీ ప్రైవేట్ మెంబర్ బిల్లుగా పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఆ బిల్లు వెనుక ప్రభుత్వం ఉందనే అభిప్రాయాన్ని అప్పటి న్యాయశాఖ మంత్రి సి.సి. బిస్వాస్ ఖండించారు.
ఆ చర్చలో పాల్గొన్న ఎంపీ సి. రాజగోపాల్ నాయుడు “రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాల్లో పేర్కొన్న విధంగా, అన్ని మతాల ధార్మిక, దాతృత్వ ఆస్తుల కోసం ఒకే చట్టం ఉండటం సముచితం. ఒక మతానికి సంబంధించి మాత్రమే చట్టం ఉండటం సరి కాదు” అని తమ వాదనను స్పష్టం చేసారు.
దానికి స్పందిస్తూ, అన్ని మతాలకు చెందిన ధార్మిక ఆస్తుల కోసం ఒకే చట్టం తీసుకురావాలనే ఆలోచన ఉందని న్యాయశాఖ మంత్రి తెలిపారు.
విహెచ్‌పి ప్రతిపాదన:
ఆ విషయాలను విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు అలోక్ కుమార్ తమ ప్రతిపాదనలో ప్రస్తావించారు. వేర్వేరు మతాల ధార్మిక ఆస్తుల నిర్వహణకు వేర్వేరు చట్టాలు అవసరం లేదనీ, అన్ని మతాలకూ వర్తించేలా ఒకే చట్టాన్ని రూపొందించడానికి ఈ సువర్ణావకాశాన్ని ఉపయోగించుకోవాలనీ సంయుక్త పార్లమెంటరీ కమిటీకి విశ్వహిందూ పరిషత్ సూచించింది. అంతగా అవసరమైతే, మతాల ప్రత్యేక ఆచారాలకు అనుగుణంగా కొన్ని మినహాయింపులు ఉండవచ్చని పేర్కొంది.