భారతదేశాన్ని నష్టపరచాలనే దురుద్దేశంతో 2023లో అదానీ గ్రూప్ సంస్థల మీద దుష్ప్రచారం చేసిన షార్ట్‌సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రిసెర్చ్ మోసాలు వెల్లడయ్యాయి. ఆర్థిక లబ్ధి కోసం తాము ఎంపిక చేసుకున్న కొన్ని కంపెనీల గురించి ప్రతికూల కథనాలు తయారు చేసి, వాటిని ప్రచారంలో పెట్టడానికి హిండెన్‌బర్గ్ సంస్థ ఆన్సన్ ఫండ్స్ అనే సంస్థతో కలిసి పని చేసినట్లు బట్టబయలైంది. దాంతో ఆ సంస్థ మీద సెక్యూరిటీస్ మోసం, మార్కెట్‌లను మాయ చేయడం, రాజకీయ సంబంధాల ఆరోపణలు నిజమని తేలాయి. దాంతో అదానీ సంస్థకు వ్యతిరేకంగా హిండెన్‌బర్గ్ రిసెర్చ్ దురుద్దేశపూర్వకంగా చేసిన ప్రచారం వెనుక కారణాలు ఏంటన్న సందేహాలు తలెత్తాయి.
నాథన్ ఆండర్సన్ అనే వ్యక్తి నడిపిన హిండెన్‌బర్గ్ సంస్థ చాలాకాలం నుంచి తాము స్వతంత్రంగా పనిచేస్తున్నామనీ, తమ పరిశోధనలపై బయటి వ్యక్తుల ప్రభావం ఏమీ లేదనీ చెప్పుకుంటూ ఉండేది. అయితే ఇటీవల పరువునష్టం దావా సందర్భంగా కోర్టులో దాఖలు చేసిన పత్రాలను పరిశీలిస్తే వారి కార్యకలాపాల నిజరూపం బైటపడింది. కెనడాకు చెందిన హెడ్జ్‌ఫండ్ సంస్థ ఆన్సన్ ఫండ్స్, హిండెన్‌బర్గ్ సంస్థతో కలిసి పనిచేసామని ఒప్పుకుంది. స్టాక్‌మార్కెట్లో వివిధ షేర్ల ధరలను పతనం చేసి, వాటిని షార్ట్ సెల్ చేసేందుకు తప్పుడు నివేదికల రూపకల్పనలో హిండెన్‌బర్గ్‌తో చేతులు కలిపామని ఆ సంస్థ న్యాయస్థానం ముందు అంగీకరించింది.
అదానీపై దాడి కోసం హిండెన్‌బర్గ్, ఆన్సన్ ఫండ్స్ సంస్థలు ఒక రాజకీయ పార్టీతో కలిసి పనిచేసాయన్న విషయం బహిర్గతం అవడంతో ఈ కేసు మరింత సమస్యాత్మకంగా మారింది. ఆన్సన్ ఫండ్స్ సహవ్యవస్థాపకుడి భార్య మొయెజ్ కసమ్, మన దేశానికి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మహువా మొయిత్రాతో గతంలో కలిసి పనిచేసింది. అప్పటినుంచే వారిద్దరూ మంచి మిత్రులని ఇప్పుడు వెల్లడైంది. అదానీ గ్రూప్ మీద మహువా మొయిత్రా పార్లమెంటులోనూ, బైటా చేసిన తప్పుడు ఆరోపణలు అందరికీ తెలిసినవే. అదానీ గ్రూప్‌ను అస్థిరపరచడం కోసం ప్రతిపక్షం చేసిన ప్రయత్నాల్లో ప్రధానమైన ఎంపీ మహువా మొయిత్రా. ఆమెకు, ఆన్సన్ ఫండ్స్ సహవ్యవస్థాపకుడి భార్యకూ ఉన్న స్నేహబంధం ఇప్పుడు బట్టబయలైంది.
అదానీ వివాదం వల్ల కలిగిన రాజకీయ పరిణామాలు చాలా తీవ్రమైనవి. అదానీ గ్రూప్ స్టాక్ ధరల వక్రీకరణకు, కార్పొరేట్ మోసాలకూ పాల్పడుతోందంటూ హిండెన్‌బర్గ్ రిసెర్చ్ సంస్థ చేసిన తప్పుడు ఆరోపణలను భారతదేశ ప్రతిపక్షాలు, ప్రధానంగా టీఎంసీ, శరవేగంగా అందిపుచ్చుకున్నాయి. ఆ మేరకు నరేంద్ర మోదీ మీద, ఆయన ప్రభుత్వం మీదా తీవ్ర ఆరోపణలు చేసాయి. నిజానికి హిండెన్‌బర్గ్ నివేదిక వచ్చిన సమయం, దానికి మీడియా విస్తృత ప్రాధాన్యం ఇవ్వడం కాకతాళీయం కాదని అప్పట్లోనే పలువురు అనుమానించారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో అదానీ వివాదం రాజకీయంగా తీవ్ర వివాదానికి దారి తీసింది.
ఆన్సన్ ఫండ్స్‌కీ మహువా మొయిత్రా రాజకీయ యంత్రాంగానికీ ఉన్న గాఢమైన, నిగూఢమైన సంబంధాలు ఇప్పుడు బైటపడడంతో అదానీ సంస్థను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. అదానీకి ఆర్థికంగా నష్టం కలిగించడం మాత్రమే కాదు, రాజకీయ ప్రత్యర్థులను మట్టుపెట్టేందుకు కూడా ఆ కుట్ర పన్ని ఉంటారనే అనుమానాలు కలుగుతున్నాయి. హిండెన్‌బర్గ్, ఆన్సన్ ఫండ్స్, మహువా మొయిత్రా మధ్య సంబంధాలు బట్టబయలు అవడంతో అదానీ వివాదం కేవలం కాకతాళీయమా, లేక రాజకీయ లబ్ధికి ప్రయత్నించడంతో పాటు భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన వ్యాపార దిగ్గజాన్ని బలహీనపరచడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
హిండెన్‌బర్గ్, ఆన్సన్ ఫండ్స్ సంస్థలు ఉద్దేశపూర్వకంగా స్టాక్ మార్కెట్లలో ధరవరలను తప్పుదోవ పట్టించారని నిరూపణ అయితే దాని పరిణామాలు అంతర్జాతీయ ఆర్థిక విపణుల మీద తీవ్రంగా ఉంటాయి. స్టాక్ విలువలను పతనం చేయడానికి అబద్ధపు లేక తప్పుడు నివేదికల మీద ఆధారపడి చేసే షార్ట్‌సెల్లింగ్ ప్రచారాలు మార్కెట్‌ను మోసగించడమే అవుతుంది. అది మొత్తంగా స్టాక్ ఎక్స్‌ఛేంజిల సమగ్రతను, పెట్టుబడిదారుల విశ్వాసాన్నీ నాశనం చేయడమే.
ఈ కుట్రలో… భారతదేశంలో రిజిస్టర్ అయిన ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ అయిన ఆన్సన్ ఫండ్స్ వంటి హెడ్జ్ ఫండ్స్ ప్రమేయం కూడా…. దేశీయ క్యాపిటల్ మార్కెట్ల మీద తీవ్రమైన, దీర్ఘకాల ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. సెబి ఇప్పటికే ఆన్సన్ ఫండ్స్ సంస్థ కార్యకలాపాలను తనిఖీ చేయడం మొదలుపెట్టింది. ఆ దర్యాప్తులో ఆన్సన్ ఫండ్స్ తప్పుచేసినట్లు నిర్ధారణ అయితే దాని ప్రభావం ఆ సంస్థ ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ హోదా మీద కూడా పడుతుంది. కుట్ర కారణంగా ఆన్సన్ ఫండ్స్ సంస్థకు ఎఫ్‌పిఐ హోదా పోతే ఆన్సన్, హిండెన్‌బర్గ్ రెండు సంస్థల పేరుప్రతిష్ఠలూ పోతాయి. అది ఆ రెండు సంస్థలతో ఆగదు, ప్రపంచ ఆర్థిక నెట్‌వర్క్‌ల మీద తీవ్ర దుష్ప్రభావం చూపిస్తుంది.
ఇప్పటికే మహువా మొయిత్రా చేసిన ఆరోపణల ఆధారంగా భారతదేశపు అవినీతి నిరోధక వ్యవస్థ లోక్‌పాల్, తమ విచారణకు హాజరవాలంటూ సెబి ఛైర్‌పర్సన్ మాధవీ పూరీ బుచ్‌కు, మహువా మొయిత్రాతో పాటు ఫిర్యాదు చేసిన మరో ఇద్దరికీ నోటీసులు జారీ చేసింది. ఆ హియరింగ్ జనవరి 28న జరగనుంది. లోక్‌పాల్ ఆదేశాల మేరకు మాధవి బుచ్ తనమీద వచ్చిన ఆరోపణలకు జవాబుగా 2024 డిసెంబర్ 7న అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో తనమీద చేసిన ప్రతీ ఆరోపణకూ వివరంగా జవాబులివ్వడమే కాక, ఆ ఆరోపణల వెనుక దురుద్దేశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసారు. అంతకుముందే, గత సెప్టెంబర్ 20న లోక్‌పాల్ ఒక ప్రకటన చేస్తూ మహువా మొయిత్రా చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు జరిపించడానికి తగినన్ని ఆధారాలు లేవని స్పష్టం చేసింది. హిండెన్‌బర్గ్ నివేదిక సాకుతో మహువా మొయిత్రా చేసిన ఫిర్యాదు వెనుక రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన కుట్ర తప్ప వాస్తవం లేదని దాన్నిబట్టే అర్ధమవుతోంది.
ఈ కుంభకోణానికి సంబంధించి కోర్టులో దాఖలు చేసిన పత్రాల్లోని వివరాలు సంచలనాత్మకంగా ఉన్నాయి. కుంభకోణంలో ప్రధాన పాత్రధారి అయిన ఆన్సన్ ఫండ్స్ సంస్థ హిండెన్‌బర్గ్‌తో కలిసి పనిచేయడం మాత్రమే కాదు, చాలావరకూ నివేదికల్లో రాసిన కంటెంట్‌ను ఆన్సన్ ఫండ్స్ సంస్థే తయారుచేసింది. ఆన్సన్ ప్రతినిధులు లీగల్ ప్రొసీడింగ్స్‌లో… కొన్ని కంపెనీలకు వ్యతిరేకంగా తప్పుడు నివేదికలు రూపొందించడానికి తాము హిండెన్‌బర్గ్‌తో చేతులు కలిపామని ఒప్పుకోవడం దిగ్భ్రాంతికరమైన వాస్తవం. దాన్ని బట్టే వారి లక్ష్యం స్పష్టంగా తెలిసిపోతోంది: స్టాక్ మార్కెట్‌లలో పతనాలను సృష్టించడం, మార్కెట్ విలువలు పడిపోవడంతో వాటినుంచి లాభాలు ఆర్జించడం అనేది వారి ప్రధాన లక్ష్యం. ఆ హస్తలాఘవంలో అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే లాభాల్లో వాటాను పంచుకోవడం గురించిన చర్చ. దాన్నిబట్టే ఆ ఏర్పాటు పెద్ద కుట్ర అని అర్ధమవుతోంది. ఆన్సన్ ఫండ్స్ ప్రకటన మరో దొంగ వ్యవహారాన్ని కూడా బైటపెట్టింది. అదేంటంటే, హిండెన్‌బర్గ్ సంస్థ తమను తాము పూర్తి స్వతంత్ర సంస్థగా పలుమార్లు ప్రకటించుకుంది. కానీ అది పెద్ద అబద్ధం. హిండెన్‌బర్గ్ అధిపతి నాథన్ ఆండర్సన్ గత కొన్ని నెలలుగా… తమ సంస్థ క్షేత్రస్థాయిలో పూర్తి స్వేచ్ఛగా శాస్త్రీయ పరిశోధనలు చేస్తుందని, ఆ నివేదికపై బాహ్యశక్తుల ప్రభాబం ఎంతమాత్రం లేదనీ చెబుతున్నాడు. కోర్టులో దాఖలు చేసిన వివరాలు, ఇమెయిల్ వివరాలను బట్టి… అవన్నీ అబద్ధాలని తెలిసిపోయింది. ఆన్సన్ ఫండ్ నిద్రాణ పాత్ర కాకుండా నిర్ణాయక పాత్ర పోషించిందని తేటతెల్లంగా వెల్లడైంది. ఆన్సన్ ఫండ్ నిర్ణయించిన కంటెంట్, దాని స్వరూపం, దాని లక్ష్యాలను బట్టి, అదానీ మీద బురద జల్లడం వెనుక ఆ సంస్థ హస్తం కచ్చితంగా ఉందని న్యాయస్థానం నిర్ధారించింది.