దేశవ్యాప్తంగా JEE మెయిన్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా రెండు పేపర్లకు కలిపి 12 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది హాజరవుతున్నారు.
హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పరీక్ష జరగనుంది.
ఈ నెల 22, 23, 24, 28, 29 తేదీల్లో ఎన్ఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. 30న బీఆర్క్, బీ ప్లానింగ్ సీట్ల కోసం పేపర్-2 పరీక్ష జరుగుతుంది.
పరీక్ష రాసే విద్యార్థులు ఎగ్జామ్ హాల్లోకి హ్యాండ్బ్యాగ్, పర్స్, ఏ రకమైన కాగితం, స్టేషనరీ, టెక్స్ట్ మెటీరియల్, తినుబండారాలు, తాగునీరు , మొబైల్ ఫోన్, ఇయర్ ఫోన్, మైక్రోఫోన్, ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్ళరాదు. ఉంగరాలు, కంకణాలు, చెవిపోగులు, అలంకారాలు,లోహ మూలకాలు, మందపాటి సోల్ ఉన్న బూట్లు ధరించడంపై నిషేధం విధించారు.