జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును శాశ్వత చిహ్నంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు లేఖ పంపింది. తాజా ప్రకటనతో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా జనసేన అవతరించింది.
గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 100 శాతం స్ట్రయిక్ రేట్ సాధించింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ, రెండు ఎంపీ స్థానాల్లోనూ విజయం సాధించింది. దీంతో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా అవతరించింది.
దశాబ్ద కాల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోరాటానికి, గడచిన ఎన్నికల్లో సాధించిన చారిత్రక విజయానికి దక్కిన గౌరవం అంటూ జనసేన పార్టీ స్పందించింది. సమాజంలో మార్పు కోసం పవన్ కళ్యాణ్ 2014లో పార్టీ స్థాపించారని పేర్కొంది. ఈ సందర్భంగా ప్రతీ జనసైనికుడికి, వీరమహిళకు, నాయకులకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపింది.