ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా 20. 01. 2025న రికార్డు స్థాయిలో రూ.23.71 కోట్ల ఆదాయాన్ని సాదించింది. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ రోజుల్లో మూడుసార్లు గతంలో ఎన్నడూ లేని విధంగా రోజువారీ ఆర్టీసీ ఆదాయం రికార్డు స్థాయిలో రూ.20 కోట్లు దాటింది. సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక బస్సులను నడపడం వల్ల, ప్రయాణికులు విశేషంగా ఆదరించడం వల్లా ఆర్టీసీ రికార్డు స్థాయిలో ఆదాయం సాధించిందని ఏపీటీటీడీ కమిషనర్ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు.
ఈ యేడాది సంక్రాంతిని పురస్కరించుకుని సంస్థ 7,200 బస్సులను నడపాలని భావించింది. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా 9,097 బస్సులను నడిపింది. ఈ ప్రత్యేక బస్సుల ద్వారా సంస్థ రూ. 21.11 కోట్ల ఆదాయం ఆర్జించిందని ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. ఈ సంక్రాంతికి ప్రయాణికులు వారి ప్రయాణ వ్యయభారాన్ని తగ్గించుకునేందుకు ఏపీఎస్ఆర్టీసీ బస్సులనే ఎంచుకున్నారని సంతోషం వ్యక్తం చేసారు.
ప్రయాణికులకు బస్సులను ముందస్తుగా అందుబాటులో ఉంచడం, సమర్ధమైన నిర్వహణ – పర్యవేక్షణ, రద్దీకి అనుగుణంగా బస్సుల ఏర్పాటు వల్లనే ఆర్టీసీ రికార్డు స్థాయి ఆదాయం సాధించగలిగిందని ద్వారకా తిరుమలరావు ప్రకటించారు.