సుమారు 4500 ఏళ్ళ నాటి సింధులోయ లిపి రహస్యాలను కనుగొనడానికి కొత్తతరం విద్వాంసులు, పరిశోధకులు కృత్రిమ మేధను (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్), ఇతర ఆధునిక సాంకేతికతలనూ వినియోగిస్తున్నారు. ఈ అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో ఈసారైనా సింధులిపి నిజంగా తెలుస్తుందని పరిశోధకులు ఆశాభావంతో ఉన్నారు.
సింధులోయ లిపిలో ఉపయోగించిన ప్రతీకల నిర్మాణక్రమాన్నీ, వాటి తరచుదనాన్నీ పరీక్షించడానికి పరిశోధకులు ఏఐ అల్గారిథమ్స్‌ను (కృత్రిమ మేధ) ప్రయోగిస్తున్నారు.
సుమారు 4500 ఏళ్ళ క్రితం సింధులోయలో ప్రాచీన నాగరికత వెల్లివిరిసింది. అది ఉన్న ప్రాంతం ప్రస్తుతం భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉంది. ఆ లోయలో శిలాజాలు, కళాఖండాలు ఎన్నో లభ్యమయ్యాయి. అక్కడ అత్యున్నత స్థాయికి చెందిన రాత పద్ధతి (లిపి) కూడా కనుగొన్నారు. కానీ దాన్ని ఇప్పటివరకూ ఎవరూ అర్ధం చేసులేక పోయారు.
సింధు లిపి నేటికీ ఓ మర్మమే:
పురావస్తు శాస్త్రం, భాషా శాస్త్రం, చరిత్ర, సైన్సు వంటి వివిధ రంగాలకు చెందిన నిపుణులు దాదాపు వందేళ్ళకు పైగా కాలం నుంచీ సింధు లిపిని అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఇప్పటివరకూ ఏ విజయమూ సాధించలేక పోయారు. సంప్రదాయిక విధానాల నుంచి ఎన్నో ఆధునిక టెక్నిక్‌ల వరకూ ప్రయోగించారు. కంప్యూటర్లు, స్టాటిస్టికల్ అనాలసిస్‌లూ ఎన్నోరకాల పరిశోధనా పద్ధతులను వినియోగించారు. కానీ సింధు లిపిని నేటికీ అర్ధం చేసుకోలేకపోయారు.
కృత్రిమ మేధ వినియోగం:
అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ఒమర్ ఖాన్ పురావస్తు నిపుణుడు, సింధులిపి పట్ల ఆసక్తి కలిగిన వాడు. ఆయన మూడు దశాబ్దాలకు పైగా హరప్పా.కామ్ అనే వెబ్‌సైట్ నిర్వహిస్తున్నాడు. సింధులోయ నాగరికత అధ్యయనాల గురించిన అత్యున్నత స్థాయి వ్యాసాలను ఆ సైట్‌లో ప్రచురిస్తున్నారు. సింధులోయ లిపిని డీసిఫర్ చేయడంలో పరిశోధకులకు, విద్వాంసులకూ కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ – ఎఐ) ఎంతగానో సహాయం చేయగలదని ఆయన అంటున్నాడు. అంతేకాదు, ఆ జ్ఞానాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులోకి తేవడానికి కూడా ఎఐ సాయపడుతుందని భావిస్తున్నాడు.
ఇప్పటికీ మార్మికంగానే ఉండిపోయిన సింధు లిపిని డీకోడ్ చేయడంలో బహత ముఖోపాధ్యాయ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, భరత్ రావు అనే క్రిప్టోగ్రాఫర్ విస్తృతంగా కృషి చేస్తున్నారు. వేర్వేరు రంగాలకు చెందినవారు అయినప్పటికీ వారిద్దరూ ఈ ప్రయత్నంలో కలిసి పనిచేస్తున్నారు. ‘‘సింధు లిపి నన్ను విస్మయపరిచింది. 2010 నుంచీ దాన్ని అధ్యయనం చేస్తున్నాను. దాని అర్ధాన్ని కనుగొనడానికి శాస్త్రీయ విశ్లేషణల కోసం శ్రమిస్తున్నాను’’ అని బహత చెబుతున్నారు. వారిప్పుడు ఏఐ సాయంతో సింధు లిపిని డీకోడ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.