అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన వేళ దేశీయ స్టాక్ సూచీలు దారుణంగా పడిపోయాయి. తాను అధికారంలోకి వస్తే చైనా, కెనడా, మెక్సికో దేశాలపై సుంకాలు పెంచుతానంటూ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడంతో ఏ క్షణంలోనైనా సుంకాలు పెంచుతారనే భయాలతో స్టాక్ మార్కెట్లలో వణుకు మొదలైంది. పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగడంతో ఒకే రోజు రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.
స్టాక్ సూచీలు భారీగా పడిపోయాయి. 77261 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్ ఓ దశలో 1300 పాయింట్లు కోల్పోయింది. తరవాత కొద్దిగా కోలుకుని 1235 పాయింట్ల నష్టంతో 75838 వద్ద ముగిసింది. నిఫ్టీ 320 పాయింట్ల నష్టంతో 23024 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి విలువ 86.58గా ఉంది.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో ఒకటిరెండు మినహా అన్ని షేర్లు నష్టాలను చవిచూశాయి. ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్సీఎల్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జొమాటో షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. ముడిచమురు ధర బ్యారెల్ 79 డాలర్లకు ఎగబాకింది. ఔన్సు స్వచ్ఛమైన బంగారం 2732 డాలర్లకు పెరిగింది.