అమెరికా తాలిబాన్ల మధ్య ఖైదీల మార్పిడి ఒప్పందం కుదిరింది. అఫ్టాన్ ఫైటర్ ఖాన్ మహమ్మద్‌ను విడిచిపెడితే, తన వద్ద నున్న అమెరికా పౌరులను వదిలేస్తామని తాలిబన్ ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు అమెరికా సుముఖంగా ఉన్నట్లు అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. 20 సంవత్సరాల కిందట అరెస్టై కాలిఫోర్నియా జైలులో జీవిత ఖైదులో ఉన్న ఖాన్ మహమ్మద్‌ను విడిపించుకునేందుకు అఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. అమెరికాతో గత కొంత కాలం నుంచి అఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం సుదీర్ఘ చర్చలు సాగిస్తోంది. చర్చలు ఫలించినట్లు అధికారులు చెబుతున్నారు. అమెరికా, అఫ్ఘనిస్థాన్ రెండు దేశాలకు ఖతార్ మధ్యవర్తిత్వం వహించింది.
2022లో విదేశీ పర్యటనలో ఉండగా అమెరికా పౌరుడు ర్యాన్‌ను తాలిబన్లు కిడ్నాప్ చేశారు. ర్యాన్‌ను విడిపించుకునేందుకు అమెరికా మాజీ అధ్యక్షడు బైడెన్ ప్రయత్నాలు చేశారు. అయినా ఫలించలేదు.ఇటీవల బైడెన్ బాధితుల కుటుంబసభ్యులతో ఫోన్లో సంభాషించారు. ర్యాన్ విడుదలకు చర్చలు జరుగుతున్నాయని, అవి చివరి దశకు చేరుకున్నాయన్నారు. త్వరలోనే ర్యాన్ విడుదల అవుతారని బాధితుల కుటుంబసభ్యులకు భరోసా కల్పించారు. తాజాగా సుదీర్ఘ చర్చల అనంతరం రెండు దేశాలు ఖైదీల మార్పిడిపై అంగీకారానికి వచ్చాయి.