పదివికెట్ల తేడాతో గెలుపు
మహిళల క్రికెట్ U19T20 వరల్డ్‌కప్-2025 టోర్నీలో భాగంగా మలేసియాతో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. పదివికెట్ల తేడాతో విజయం సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది.
కౌలలాంపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ నెగ్గిన భారత్, ఫీల్డింగ్ ఎంచుకుంది. మలేసియా ఓపెనర్లను భారత్ యువతులు ఆదిలోనే బోల్తా కొట్టించారు. ఓపెనర్ నూని ఫరినిని జోషిత డకౌట్ గా పెవిలియన్ పంపింది. దీంతో మలేసియా నాలుగు పరుగులు వద్ద తొలి వికెట్ నష్టపోయింది. ఆ తర్వాత 12 పరుగుల వద్ద మరో ఓపెనర్ నుర్ అలియా బింటి (5)ని పరుణిక సిసోదియా రనౌట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన నఝతుల్ హిదాయ్ (5)ను ఆయుషి శుక్లా పెవిలియన్ కు పంపింది. వీరిద్దరే ఆ జట్టులో టాప్ స్కోరర్లు.
కెప్టెన్ నుర్ దనియ్ (1) ను వైష్ణవి శర్మ ఔట్ చేయడంతో 22 పరుగుల వద్ద మలేసియా ఐదో వికెట్ నష్టపోయింది. నుర్ ఇఝత్తుల్ కూడా ఆయుషి శుక్లా బౌలింగ్ లో పరుగుల ఖాతా తెరవకుండా పెవిలియన్ చేరింది. తర్వాత వైష్ణవి శర్మ హ్యాట్రిక్ వికెట్లు తీయడంతో స్కోర్ బోర్డు 30 వద్ద ఉన్నప్పుడు మలేసియా మూడు వికెట్లు నష్టపోయింది. ఆఖరి వికెట్ గా మర్సియా (1)ను ఆయుషి ఔట్ చేయడంతో మలేసియా ఇన్నింగ్స్ 31 పరుగుల వద్ద ముగిసింది. మలేసియా 14.3 ఓవర్లలో 31 పరుగులు మాత్రమే చేయగల్గింది.
భారత బౌలర్లలో వైష్ణవి శర్మ ఐదు వికెట్లు తీయగా ఆయుషి శుక్లా మూడు జోషిత ఒక వికెట్ తీశారు.
ప్రత్యర్థి విధించిన 32 పరుగుల లక్ష్యాన్ని భారత్ యువతులు 2.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించారు. త్రిష్ 12 బంతుల్లో 27 పరుగులు చేయగా కమిలిని ఐదు బంతుల్లో నాలుగు పరుగులు చేసింది. దీంతో భారత్ విజయం ఖాయమైంది.
ఐదు వికెట్లు తీసి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన వైష్ణవి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.