తమిళనాడు తిరుపరన్‌కుండ్రం పట్టణంలో మదురై కొండ మీద జంతువులను బలి ఇవ్వడానికి ఎస్‌డిపిఐ సహా ముస్లిం సంస్థలు గత శనివారం ప్రయత్నించాయి. హిందువుల ఫిర్యాదుతో పోలీసులు జోక్యం చేసుకుని ఆ దుర్మార్గాన్ని ఆపివేయించారు. ఎస్‌డిపిఐ అనేది నిషిద్ధ ఉగ్రవాద సంస్థ పిఎఫ్ఐ రాజకీయ విభాగం.
మదురై కొండ మీద ప్రఖ్యాత మురుగన్ దేవాలయం ఉంది. అక్కడే సికందర్ బాదుషా దర్గా పేరిట ముస్లిములు ఒక దర్గా నిర్మించారు. అక్కడ ముస్లిం సంస్థలు కోళ్ళు, మేకలను బలి ఇస్తున్నాయి. అలాంటి పనులను నిలువరించాలంటూ ఇందూ మక్కల్ కచ్చి (ఐఎంకె) మదురై జిల్లా అధ్యక్షుడు సోలైకన్నన్ స్థానిక పోలీసు కమిషనర్ లోగనాదన్‌కు ఫిర్యాదు చేసారు.
సోలైకన్నన్ తన విజ్ఞప్తిలో పోలీసులకు ఇలా తెలియజేసారు. మదురైలోని తిరుపరన్‌కుండ్రం సుబ్రమణ్యస్వామి ఆలయ పర్వతం అత్యంత ప్రాచీనమైనది. ఆ పర్వత ప్రాంతం హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రదేశం. స్థానిక హిందువులు ఆ పర్వతాన్ని, కొండమీద స్వామి ఆలయాన్నీ పూజిస్తారు. ప్రతీ పూర్ణిమ నాడూ అక్కడ గిరి ప్రదక్షిణం చేస్తారు. అక్కడ ముస్లిములు ఒక దర్గా కట్టుకుని దాని వంకతో హిందువులకు పవిత్ర ప్రదేశమైన ఆ కొండ మీద జంతువులను కుర్బానీ పేరిట వధిస్తున్నారు. దాన్ని నిలువరించండి అని కోరారు.
జనవరి 18 శనివారం నాడు ఇస్లామిక్ జమాత్ నేతల నాయకత్వంలో ఒక ముస్లిముల గుంపు కొండ మీదకు చేరుకుంది. అక్కడ కుర్బానీ పేరుతో కోళ్ళు, మేకలను చంపి దర్గాలో విందు చేసుకోవాలని ప్రయత్నించారు. అయితే ముస్లిములు దర్గాలో ప్రార్థనలు మాత్రమే చేసుకోవాలనీ, అక్కడ జంతుబలులు ఇవ్వడానికి అనుమతి లేదనీ పోలీసులు స్పష్టం చేసారు.
గతవారంలో ఇస్లామిక్ సంస్థలు జిల్లాలోని రెవెన్యూ సహా అన్ని విభాగాల అధికారులనూ కలిసారు. సికందర్ బాదుషా దర్గా దగ్గర బలులు ఇచ్చుకోడానికి అనుమతులు కోరారు. అయితే మదురై జిల్లా యంత్రాంగం వారికి దర్గాలో ప్రార్థనల వరకే అనుమతి ఇచ్చింది.
తిరుపరన్‌కుండ్రం తమిళనాడులో మురుగన్ స్వామి ఆరు పవిత్ర క్షేత్రాల్లో ఒకటి. అలాంటి కొండ మీద జంతువులను బలి ఇవ్వడానికి ముస్లిములు ప్రయత్నించడాన్ని హిందూ మున్నాని సంస్థ సభ్యులు ప్రతిఘటించారు. హిందువులకు పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని ముస్లింలు తమ ప్రార్థనా స్థలంగా మార్చేయడానికి ప్రయత్నిస్తున్నారని హిందూ మున్నాని ఆరోపించింది.
‘‘తిరుపరన్‌కుండ్రం పర్వతానికి చాలా ఘనమైన చరిత్ర ఉంది. అలాంటి ప్రదేశాన్ని ‘సికందర్ మలై’ గా (సికందర్ కొండ) పేరు మార్చేసి పిలుస్తున్నారు. ముస్లింలను బుజ్జగించే చర్యల్లో డిఎంకె ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోంది. తిరుపరన్‌కుండ్రం పర్వతం మీద శాంతి నెలకొనడం ముఖ్యం’’ అంటూ బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు కె అన్నామలై ఒక ప్రకటన వెలువరించారు.
ఈ వివాదం 2024 డిసెంబర్ 27న మొదలైంది. తిరుపరన్‌కుండ్రం మురుగన్ ఆలయ పర్వతం మీద కట్టిన దర్గా దగ్గర కోళ్ళు, మేకలను బలి ఇవ్వడానికి కొంతమంది ముస్లిములు ప్రయత్నించారు. హిందువుల పుణ్యక్షేత్రమైన ఆ పర్వతం మీద అలాంటి పనులకు పాల్పడవద్దంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. దానికి నిరసనగా సుమారు పాతిక మంది ముస్లిములు ఆందోళన చేపట్టారు.
ఈ నెల (2025 జనవరి) మొదట్లో సికందర్ మసీదు కమిటీ, ఐక్య కూటమయిప్పు జమాత్ లకు చెందిన సుమారు వంద మంది ముస్లిములు మురుగన్ కొండ మీద మసీదులో నమాజులు చేసుకోనివ్వాలంటూ ఆందోళన చేసారు. సుమారు 400 ఏళ్ళ క్రితం సుల్తాన్ సికిందర్ అక్కడ సికందర్ బాదుషా తొళుగై పల్లివసల్ నిర్మించాడని వాదించడం మొదలుపెట్టారు. పోలీసులు వారిని తాత్కాలికంగా అదుపులోకి తీసుకున్నారు.
తిరుపరన్‌కుండ్రం పర్వత శిఖరం మీద కాశీ విశ్వనాథ ఆలయం, దీపస్తంభం, ఒక పవిత్ర వృక్షం ఉన్నాయి. బ్రిటిష్ వారి పాలనా కాలంలో ఫస్ట్ అడిషనల్ సబార్డినేట్ కోర్టు ‘తిరుపరన్‌కుండ్రం పర్వతానికి యజమాని మురుగన్ దేవాలయమే’ అని తీర్పు వెలువరించింది కూడా. అయితే 2011 నుంచి ఇస్లామిక్ నిషిద్ధ ఉగ్రవాద సంస్థ పిఎఫ్ఐ అనుబంధ రాజకీయ పార్టీ అయిన ఎస్‌డిపిఐ అక్కడ వివాదం రేపుతోంది. దీపస్తంభం దగ్గర హిందువులు జెండా ఎగురవేసుకోడానికి ప్రయత్నిస్తే దానిమీద గొడవ రాజేసింది. ఇప్పుడు ఏకంగా అక్కడ జంతువులను బలి ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే మురుగన్ పర్వతం మీద కొన్ని ప్రాంతాలను ముస్లిములు తమ పండుగల పేరుతో ఆక్రమించుకున్నారు. దాన్ని అడ్డుకోవలసిన దేవదాయ ధర్మదాయ శాఖ ముస్లింలను బుజ్జగింపు రాజకీయాల్లో మునిగిపోయి, హిందువులకు అన్యాయం చేసిందన్న ఆరోపణలున్నాయి.