ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక జనసంగమంగా మహాకుంభమేళా 2025 వాసికెక్కింది. ప్రయాగరాజ్‌లోని త్రివేణీసంగమం దగ్గర ఈ కుంభమేళా జనవరి 13న మొదలై ఫిబ్రవరి 26 వరకూ సాగుతుంది. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు తెలియని విదేశీయులకు ఈ జనసందోహం అబ్బురంగా కనిపిస్తోంది. ముఖ్యంగా, కుంభమేళా వంటి ప్రత్యేక సందర్భాల్లో తప్ప బైట కనిపించని నాగ సాధువులు, అఘోరీల వంటివారి సంగతి అర్ధం కాని విదేశీ మీడియా వారిని అనాగరికులుగా, భారతదేశాన్ని అనాగరిక దేశంగా ముద్రలు వేస్తూనే ఉంది. బీబీసీ, వాషింగ్టన్ పోస్ట్ వంటి భారత వ్యతిరేక మీడియా నాగ సాధువుల మీద కట్టుకథలల్లి తమ కండూతి తీర్చుకుంటున్నాయి. ఇంతకీ అసలీ నాగా సాధువులు ఎవరు? కుంభమేళాలో, ప్రత్యేకించి అమృత స్నానాల సమయాల్లో కనిపించే నాగా సాధువులు నిరాడంబరమైన జీవితం గడుపుతూ వీరుల్లా ప్రవర్తించడం వెనుక కథ ఏమిటి?
కుంభమేళాలో నాగ సాధువులు విడదీయరాని భాగం. గంగా యమునలతో పాటు అంతర్వాహిని అయిన సరస్వతీ నది కలిసే త్రివేణీ సంగమంలో ‘అమృత స్నానం’ పేరిట పవిత్ర స్నానాలు ఆచరించడం కుంభమేళా విశేషం. ఆ పవిత్ర స్నానం మన పాపాలను క్షాళన చేసి మోక్షం వైపు నడిపిస్తుందని హిందువుల విశ్వాసం.
ఈ యేడాది మకర సంక్రాంతి నాడు మొదటి అమృత స్నానం నాగ సాధువులు చేయడంతో మహాకుంభమేళా ప్రారంభమైంది. నాగ సాధువుల క్రమశిక్షణతో కూడిన ఊరేగింపులు, భగవన్నామ జపాలు, త్రివేణీసంగమంలో పవిత్ర స్నానాలు కోట్లాది ప్రజలను ఆకర్షించాయి.
నాగ సాధువులు ఎక్కడివారు?:
నాగ సాధువుల మూలాలు ప్రాచీన భారతదేశంలో ఉన్నాయి. అప్పట్లో ఆలయాలు, పవిత్ర క్షేత్రాలను దురాక్రమణ దారుల దాడుల నుంచి రక్షించుకోడానికి సాధు సన్యాసులే వీరయోధులుగా బాధ్యత స్వీకరించారు. వారి యుద్ధ సంప్రదాయాన్ని ఆదిశంకరాచార్యులు 8వ శతాబ్దంలో క్రమబద్ధీకరించారు. సనాతన ధర్మ పరిరక్షణకు ఆదిశంకరులు దశనామీ సంప్రదాయాన్ని, అఖాడాలు అనబడే సాధువుల మఠాలనూ ఏర్పాటు చేసారు. ‘నాగ’ అనే పదం వారి వైరాగ్యాన్ని సూచిస్తుంది. భౌతిక వస్తువులు, ప్రాపంచిక విషయాలపై వారికి ఎలాంటి ఆసక్తీ ఉండదు. చివరికి దుస్తుల మీద కూడా ఎలాంటి ఆకర్షణా ఉండదు. ఈ ప్రపంచంలో సుఖవంతమైన జీవితం కోసం వెంపర్లాడకుండా నిర్లిప్తంగా ఉండిపోవడం వారి ప్రత్యేకత.
ఒక సామాన్య వ్యక్తి నాగ సాధువు అవడానికి ఎన్నో యేళ్ళు కఠోరమైన తపోసాధన చేయాల్సి ఉంటుంది. నాగ సాధువులు కావాలని భావించేవారు కుటుంబం, సిరిసంపదలు, వ్యక్తిగత కీర్తి వంటి అన్ని ప్రాపంచిక బంధాలనూ వదిలివేయాలి. గురువుల మార్గదర్శనంలో కఠోరమైన ఆధ్యాత్మిక, భౌతిక శిక్షణ పొందాలి. ఆ శిక్షణలో ధ్యానం, యోగాభ్యాసం, వేదపఠనం, యుద్ధవిద్యలు అన్నీ ఉంటాయి. నాగ సాధువులు ఎంతో నిష్ఠగా, నిరాడంబరంగా ఉంటారు. అత్యంత భయంకరమైన వాతావరణ పరిస్థితుల్లో సైతం ధ్యానం చేస్తూ ఉంటారు. జపతప వ్రతాలతో బ్రహ్మచర్య జీవనం గడుపుతూ ఉంటారు. మొత్తం విబూది పులుముకున్న ఒళ్ళు, జడలు కట్టిన జుత్తు, నామమాత్రపు దుస్తులతో ఉండే వారి ఆహార్యాన్ని చూస్తేనే భౌతిక ప్రపంచపు లంపటాలపై వారి నిరాసక్తి, ఆధ్యాత్మిక విషయాలపై జిజ్ఞాస అర్ధమవుతాయి.
అఖాడాలు – నాగ సాధువులు:
నాగ సాధువులు శైవ సంప్రదాయాన్ని అనుసరించే వారు. జునా అఖాడా, మహానిర్వాణి అఖాడా, నిరంజని అఖాడా వంటి అఖాడాలకు చెందిన వారు. కుంభమేళాలో పాల్గొనే 13 సాధు సంప్రదాయాల్లో ఏదో ఒకదానికి చెందినవారు. వారి ఆధ్యాత్మిక, వీర వారసత్వానికి గుర్తింపుగా, కుంభమేళాల్లో జరిగే అమృత స్నానాల్లో మొట్టమొదట స్నానం చేసే అవకాశం నాగ సాధువులకే ఉంటుంది. అన్ని అఖాడాలూ ఆ వరుసను కచ్చితంగా పాటిస్తాయి. నాగ సాధువుల తర్వాతే అఖాడాలలోని మిగతావారు స్నానాలు చేస్తారు.
జునా అఖాడా దేశంలో అతి పెద్దదీ, ప్రముఖ గుర్తింపు పొందినదీ అయిన అఖాడా. ఆ అఖాడాలో నాగ సాధువులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. ధార్మిక చిహ్నాలతో అందంగా అలంకరించిన రథాల మీద నాగ సాధువులు చేపట్టే ఊరేగింపులు, చేసే విన్యాసాలు చూపరులను ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. హిందూ సంస్కృతికి, హిందువుల సమైక్యతకూ నిదర్శనంగా నిలుస్తాయి. కుంభమేళాలో వారి భాగస్వామ్యం మోక్షం కోసం హిందువుల జిజ్ఞాసకు నిదర్శనం. విభూతి ధరించిన వారి శరీరాలు జీవితం క్షణభంగురం, అశాశ్వతం అని తెలియజేస్తాయి. వారి భజనలు, నినాదాలు మానవాళికి దైవం ఆశీస్సులను అర్ధిస్తాయి.
వర్తమాన కాలంలో నాగ సాధువులు హిందూధర్మానికి సాంస్కృతిక రాయబారులుగా కూడా నిలుస్తున్నారు. హిందూధర్మపు గాఢత, నిగూఢత, వైవిధ్యాలను వారు ప్రపంచానికి చాటుతున్నారు. మహాకుంభమేళా వంటి సందర్భాల్లో వారి ఉనికి, శరవేగంగా ఆధునికంగా మారిపోతున్న ప్రపంచంలో ప్రాచీన ఆచార వ్యవహారాలను పరిరక్షించడాన్ని చాటుతోంది.
కుంభమేళా 2025లో నాగ సాధువులు:
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ప్రయాగరాజ్ స్థానిక అధికార గణం కుంభమేళాలో నాగ సాధువుల ప్రాధాన్యాన్ని గుర్తించాయి. అందుకే మేళాలో వారి భాగస్వామ్యం సజావుగా సాగిపోయేందుకు విస్తృత స్థాయి ఏర్పాట్లు చేసాయి. హిందూధర్మంలో వారికున్న గౌరవ ప్రపత్తులకు అనుగుణంగా నాగ సాధువుల శిబిరాలకు, ఊరేగింపులకు, వారి రీతిరివాజులకు, ఆచార సంప్రదాయాలకూ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
సన్యాస భావం, యుద్ధకళా వారసత్వం, ఆధ్యాత్మిక గహనతల విశిష్ఠమైన సమ్మేళనమైన నాగ సాధువులు మహాకుంభమేళాకు ఆత్మలాంటి వారు. త్రివేణీసంగమంలో అమృత స్నానానికి ఆదిలో నిలవడం ద్వారా వారు పరిత్యాగం, భక్తి, ఐక్యత అనే కాలాతీత నియమాలను పునరుద్ఘాటించారు. హిందూధర్మంలో నాగ సాధువుల విశిష్ఠమైన పాత్రను పరిచయం చేయడం మాత్రమే కాదు, ఈ మహాకుంభమేళా ఆ మార్మిక సాధువుల నిరంతరాయమైన వారసత్వాన్నీ, హిందూధర్మానికి వారు చేసిన-చేస్తూన్న అపూర్వమైన సేవలను ప్రపంచమంతటికీ పరిచయం చేసే అవకాశం ఇచ్చింది.