ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేదరికాన్ని రూపుమాపడమే లక్ష్యంగా స్వయం ఉపాధి రాయితీ రుణాల మంజూరు ప్రక్రియను మరింత సులభతరం చేసింది.పథకం అమలుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. 2024 – 25 ఏడాదికి గానూ రాయితీ రుణాలు అందించేందుకు బీసీలకు రూ.896 కోట్లు, ఈడబ్ల్యుఎస్ వర్గాలకు రూ.384 కోట్లు ఇప్పటికే బడ్జెట్ లో కేటాయించింది.
వారం లోగా అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఏడాదిలో స్వయం ఉపాధి రాయితీ రుణ పథకం కింద 1.30 లక్షల మంది బీసీలు, 59వేల మంది ఈడబ్ల్యుఎస్ వర్గాలకు లబ్ది జరగనుంది.
ఈ పథకాలకు ఎంపికైన వారు గతంలో లబ్దిదారుల వాటా కింద కొంత మొత్తం పెట్టుబడిగా పెట్టేవాళ్లు. ఆ తర్వాత ఆ సొమ్మును ప్రభుత్వం రాయతీపై ఇచ్చేది. మిగతాది బ్యాంకు రుణంగా ఇప్పించేది.
తాజా మార్గదర్శకాల మేరకు లబ్దిదారులు తమ వాటా భరించాల్సిన అవసరం లేదు. యూనిట్ వ్యవస్థాపక వ్యయంలో ప్రభుత్వ రాయితీ పోను, మిగతా మొత్తాన్ని బ్యాంకు నుంచి రుణంగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
డాక్యుమెంటేషన్ కోసం బ్యాంకర్ల చుట్టూ తిరగకుండా మొత్తం ప్రక్రియ ఎంపీడీఓలు లేదా మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలోనే పూర్తి చేస్తారు. దరఖాస్తుల స్వీకరణకు ఓబీఎంఎంఎస్ అనే వెబ్ పోర్టల్‌ను రూపొందించింది. లబ్దిదారుల బ్యాంకు రుణ వాయిదాల చెల్లింపును పర్యవేక్షించే బాధ్యతను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిలో ఒకరికి అప్పగించనున్నారు.
దారిద్ర్య రేఖకు దిగువన ఉండటంతో పాటు వయసు 21 నుంచి 60 ఏళ్ల మధ్య ఉంటే ఈ పథకానికి అర్హులు. మినీ డెయిరీ, గొర్రెలు, మేకల పెంపకం, మేదర, కమ్మరి, శాలివాహన కుటుంబాలకు ఆర్ధిక సాయం, వడ్రంగి పని . జనరిక్ మందుల దుకాణాలు యూనిట్లు రుణ పథకాలకు వర్తిస్తాయి.