తెలుగు చిత్ర నిర్మాణ సంస్థల కార్యాలయాలు, నిర్మాతల ఇళ్లు, దర్శకుల కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. హైదరాబాద్లోని 55 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. పుష్ప 2 చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయాలు, నిర్మాత నవీన్, చెర్రీ కార్యాలయాలు, ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. మరో పెద్ద నిర్మాత దిల్ రాజు కార్యాలయాలు, ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. మ్యాంగో మీడియా సంస్థ కార్యాలయాల్లోనూ ఐటీ సోదాలు నిర్వహిస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పెట్టుబడులపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విదేశాల నుంచి నిధులను అక్రమ మార్గాల్లో తీసుకువచ్చి, చిత్ర నిర్మాణంలో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం అందుతోంది. గతంలోనూ ఈ సంస్థ పెట్టుబడులపై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయపన్ను, జీఎస్టీ చెల్లింపులు సక్రమంగా చేశారా? లేదా అనే విషయంలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.
వందల కోట్లతో 2015 నుంచి భారీ చిత్రాలు నిర్మిస్తోన్న మైత్రీ మూవీ మేకర్స్, దిల్ రాజుకు చెందిన సంస్థల ఆదాయపన్ను చెల్లింపుల విషయంలో తేడాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఐటీ అధికారులు అనిల్ రావిపూడి నివాసంలోనూ సోదాలు చేపట్టారు. అకౌంట్స్ రికార్డులు పరిశీలిస్తున్నారు. ఈ సోదాలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశముంది.