ట్రయల్ రన్ లో భాగంగా తొలిరోజు ఐదువేల మందికి వడ్డింపు
తిరుమలలో భక్తులకు మసాలా వడను ప్రసాదంగా అందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి తీర్మానం మేరకు సోమవారం నాడు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఐదువేల వడలను వడ్డించారు. మరో వారం పాటు పరిశీలించిన తరువాత పూర్తిస్థాయిలో అమలు చేయాలని టీటీడీ యంత్రాంగం భావిస్తోంది.
అన్నప్రసాదాల నాణ్యత, వడ అందించడంపై పలువరు భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. సంతృప్తి వ్యక్తం చేశారు. రథ సప్తమి నాటి నుంచి ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే అవకాశముంది.
శ్రీవారి భక్తులకు ప్రస్తుతం అన్నం, కూర, సాంబారు, రసం, మజ్జిగ, కొబ్బరి చట్నీ, చక్కెర పొంగలి వడ్డిస్తున్నారు. అన్నప్రసాదం మెనూలో మరో పదార్థం చేర్చాలని 2024 నవంబరు 18న టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. దీంతో సోమవారం మధ్యాహ్నం ట్రయల్ రన్ నిర్వహించారు. ఉల్లి, వెల్లుల్లి లేకుండా 5 వేల వడలను వండి భక్తులకు వడ్డించారు.
వైకుంఠ ద్వార దర్శన భాగ్యం ఎంతమందికంటే…?
ఈ నెల 10 నుంచి 19 వరకు మొత్తం 6.83 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం దక్కింది. హుండీ కానుకుల రూపంలో స్వామివారికి రూ.34.43 కోట్లు సమకూరగా 1,13,132 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.